ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.నగరంలోని ఝండేవాలన్ ప్రాంతంలో ఉన్న అనార్కలి భవనంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 15 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. అపార్ట్ మెంట్ బ్లాక్ E 3లోని అనార్కలి కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
మంటలు సమీపంలోని డిడిఎ షాపింగ్ కాంప్లెక్స్‌కు వ్యాపించాయని డిసిపి (సెంట్రల్) ఎం హర్ష వర్ధన్ తెలిపారు. మంటలు భారీగా ఎగిసి పడటంతో సమీపంలో పార్క్ చేసిన పలు కార్లు దగ్ధమయ్యాయని, మంటలు సమీపంలోని బ్యాంకుకు కూడా వ్యాపించాయని పోలీసులు తెలిపారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.