న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)లోని రెండవ అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ రూములో సోమవారం మంటలు చెలరేగాయి. ఆ గదిలో ఉన్న రోగులను సురక్షితంగా బయటకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రెండవ అంతస్తులోని కిటికీల నుంచి దట్టమైన నల్లని పొగ బయటకు వ్యాపించడం కనిపించింది.
ఈ ప్రమాదం సందర్భంగా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు తెలియరాలేదు. కొద్ది నిమిషాలలోని అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు వర్గాలు తెలిపాయి. మంటలకు సంబంధించిన సమాచారం మధ్యాహ్నం 1.54 గంటల ప్రాంతంలో తమకు తెలిసిందని అధికారులు చెప్పారు. వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు వారు తెలిపారు.
పాత ఓపిడికి చెందిన భవనం రెండవ అంతస్తులో ఎమర్జెన్సీ వార్డుపైన ఎండోస్కోపీ రూము ఉందని వారు చెప్పారు. రూములో ఉన్న రోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించినట్లు అధికారులు వివరించారు.