నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు (నల్లమల) అటవీ ప్రాంతంలోని దోమలపెంట రేంజ్‌లో కార్చిచ్చుతో అడవి తగలబడింది. గత మూడు రోజులుగా వరుసగా ఏదో ఒకచోట మంటలు వ్యాపిస్తుండడంతో అప్రమత్తంగా ఉన్న అటవీ శాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు క్విక్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దింపారు. మంగళవారం దోమలపెంట రేంజ్ పరిధిలోని కొమ్మనపెంట వద్ద 5 హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎండిన గడ్డిని తొలగిస్తూ అరికట్టారని సంబంధిత అధికారులు తెలిపారు. మళ్లీ బుధవారం రాత్రి అదే రేంజ్ పరిధిలోని వటవర్లపల్లి సమీపంలో గల బైరెడ్డి బావి వద్ద 2 హెక్టార్లలో మంటలు వ్యాపించాయని,
ఇక్కడ సైతం క్విక్ రెస్పాన్స్ టీం ద్వారా మంటలను అరికట్టామని దోమలపెంట ఫారెస్ట్ రేంజ్ అధికారి గురుప్రసాద్ తెలిపారు. అక్రమంగా అడవిలో పశువుల కొట్టాన్ని ఏర్పాటు చేసి ఈ మంటలు చెలరేగడానికి కారణంగా భావిస్తున్న కుమార్, తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. అడవిలో అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లేవారు బీడీ, చుట్ట లాంటివి కాల్చి పారవేయడం ద్వారా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్నారు. 7 హెక్టార్లలో జరిగిన కార్చిచ్చులో గడ్డితో పాటు చిన్నపాటి ఎండిన మొక్కలు కాలాయని, పెద్ద చెట్లకు ఎలాంటి హాని జరగలేదని ఆయన వివరించారు. శ్రీశైలం తదితర ప్రాంతాలకు వెళ్లేవారు వేసవి కావడం వల్ల జాగ్రత్తలు పాటించాలని, అటవీ శాఖ సూచించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలను నిలపాలని సూచించారు.