మహబూబాబాద్ : అహ్మదబాద్ నుంచి చైన్నై వెళ్ల్లె నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (12655) రైలుకు పొగలు కమ్ముకోగా గమనించిన సిబ్బంది మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిపి మరమ్మతులు చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆహ్మదబాద్ నుంచి చెన్నై వైపు నిన్న వెళ్లాల్సిన నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌రైలు వెయ్యి కిలోమీటర్ల మేర డైవర్షన్ కారణంగా నిన్నటి తెల్లవారు జామున రావాల్సిన ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం మహబూబాబాద్ ప్రాంతానికి చేరుకుంది.
అంతేకాక రైలు ఇంజన్ వెనుకాలే ఉన్న జనరేటర్ భోగిలో పొగలు రావడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గమనించిన రైల్వే సిబ్బంది రైలును మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. హుటాహుటిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ఎక్కడి నుంచి రైలులో పొగలు వస్తున్నది గమనించారు. బ్రేక్ లైనర్స్ పట్టి వేయడం మూలంగానే పొగలు కమ్ముకున్నాయని గుర్తించారు. సుమారు గంటకు పైగా రైలును రైల్వే స్టేషన్‌లో నిలిపి వేయడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ ఫారం దిగి ఊపిరి పీల్చుకున్నారు. బ్రేక్ లైనర్లకు యుద్దప్రతిపాదికన మరమ్మతులు చేపట్టి వాటిని సరిచేశారు. అనంతరం రైలును యధావిదిగా ముందుకు కొనసాగించారు.