హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-, బొమ్మాయిపల్లిల మధ్య హౌరా (బెంగాల్) నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సైతం బోగీల్లో ఉన్న ప్రయాణికులను రైలులో నుంచి దించివేశారు. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ సంఘనటలో ఐదుబోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోగా, ఒక బోగి పాక్షికంగా కాలిపోయింది. అయితే మంటలను ఆర్పే సిబ్బంది వచ్చేలోపే క్రమంగా మిగతా బోగీలకు నిప్పంటుకుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయని అధికారులు తెలిపారు. ఆరో బోగీ వద్ద ఉన్న జాయింట్ తొలగించడంతో మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా రైల్వే సిబ్బంది నిలుపుదల చేశారు.
విషయం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ నుంచి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న జిఎం ప్రయాణిలను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పని చేస్తున్నట్లు జిఎం తెలిపారు. విచారణ పూర్తైన తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలిపిన వెంటనే రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
కాలిబూడిదైన ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-7
కాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం 5 బోగీలు పూర్తిగా, ఒక బోగీ పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-7 బోగీలు కాలి బూడిదయ్యాయి. ముందుగా ఎస్-4, ఎస్-5 బోగీల్లో పొగలు గమనించగానే లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కుట్రకోణంపై దర్యాప్తు
అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా?.. లేక ఏదన్నా కుట్రకోణం దాగుందా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. రైలు ప్రమాదం గురించి అధికారులను ముందుగానే ఓ అజ్ఞాతవ్యక్తి హెచ్చరించాడు. రైలు ప్రమాదం జరుగుతుందని ఈ మధ్యే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఓ అజ్ఞాత వ్యక్తి ఓ లేఖను పంపించారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన తీరుతెన్నులను పరిశీలించిన అధికారులు ఈ సంఘటనను కుట్రకోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆకాశరామన్న రాసిన లేఖలో హైదరాబాద్ టు ఢిల్లీ మార్గంలో రైలు ప్రమాదానికి గురవుతుందని హెచ్చరించగా దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.
పలు రైళ్ల రద్దు…
మరోవైపు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దక్షిణమధ్య రైల్వే దారి మళ్ల్లీంచినట్టు తెలిపింది. రామన్నపేట రైల్వే స్టేషన్లో శబరి, నడికుడిలో రేపల్లె సికింద్రాబాద్ రైళ్లను నిలిపివేశారు. జన్మభూమి, నర్సాపుర్ రైళ్లను విజయవాడ మీదుగా మళ్లీంచారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాక్‌ను క్లియర్ చేయడానికి అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్- టు మన్మాడ్ (అజంతా ఎక్స్‌ప్రెస్ )రైళ్లతో పాటు సికింద్రాబాద్ టు- తిరువనంతపురం, శబరి ఎక్స్‌ప్రెస్ (వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్ టు -హౌరా టు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లను కాజీపేట మీదుగా అధికారులు మళ్లీంచారు.
అంతా క్షేమం: సౌత్ సెంట్రల్ రైల్వే
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందొద్దని పేర్కొంది. అందరిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని, షార్ట్ సర్క్యూట్‌గా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.
ఛార్జీంగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం: ప్రయాణికులు
మిగిలిన 11 బోగీలతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌కు అధికారులు సాయంత్రం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అందులో ప్రయాణించిన ప్రయాణికులు మాట్లాడుతూ ఛార్జీంగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని వారు పేర్కొన్నారు. రైలులో సిగరెట్లను, స్నాక్స్ అమ్ముతున్నా టిటి సహా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగరెట్లు, గుట్కాలను రైలులో అమ్ముతున్నారని వీటిపై అధికారుల చర్యలు కరువయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వస్తువులు, బ్యాగులు, డబ్బులన్నీ కాలిపోయాయి
ఎవరో చైన్ లాగడంతో రైలు ఆగింది. ముందుగా ఎస్4 బోగీలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రైలు నుంచి పరుగులు తీశాం. మా లగేజీ మొత్తం కాలిబూడిదైపోయింది. వస్తువులు, బ్యాగులు, డబ్బులన్నీ కాలిపోయాయి. పగలు ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రాత్రి సమయంలో అయితే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
చైన్ లాగిన ప్రయాణికుడు
ముందుగా బోగీలో మంటలు వ్యాపించిన విషయాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే చైన్ లాగడంతో రైలు ఆగింది. దీంతో ఆ బోగిలో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. మిగతా బోగీల ప్రయాణికులను సైతం కిందకు దింపారు. చూస్తుండగానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. చైన్ లాగకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుందంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన జరిగిన సందర్భంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యారని ప్రయాణికులు తెలిపారు. వెంటనే అతన్ని రైల్వే సిబ్బంది ఆసుత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని ప్రయాణికులు పేర్కొన్నారు.
ప్రత్యేక బస్సుల్లో సికింద్రాబాద్‌కు
కొందరు ప్రయాణికులను అదే రైలులో సికింద్రాబాద్‌కు తీసుకురాగా, కాలిపోయిన ఆరు బోగీల ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో సికింద్రాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు భద్రతా చర్యలు చేపట్టలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో బ్యాగులు కాలిపోయాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశామని వారు వాపోయారు.
#WATCH | Telangana | Fire broke out on three coaches of Falaknuma Express between Bommaipally and Pagidipally, following which it was stopped. All passengers deboarded the train, no injuries reported. pic.twitter.com/QfOkvrOAST
— ANI (@ANI) July 7, 2023