రేణిగుంట : ఆంధ్రప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్ మొత్తానికి విస్తరించాయి. ఆస్పత్రి భవనంలోనే ఉంటున్న డాక్టర్ రవిశంకర్ రెడ్డి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపుచేస్తున్నారు.
రవిశంకర్ భార్య, అత్త, ఇద్దరు పిల్లలు భరత్, కార్తికను బయటకు తీసుకొచ్చారు. అయితే భరత్, కార్తిక అప్పటికే తీవ్రంగా గాయపడటంతో వారిని దవాఖానకు తరలించారు. వారిద్దరు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో డాక్టర్ రవిశంకర్ రెడ్డి కూడా మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.