మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నిర్మల్ జిల్లాలో తాత, మనవరాలు మృతి చెందగా, నగర శివారులోని పెద్ద గోల్కొండ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారులోని వ్యక్తి సజీవదహనం అయ్యాడు. వివరాల్లోకి వెళితే..నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం గోపాల్ పేట్‌కు చెందిన బచ్చన్ సింగ్, చంద్రకళలు ఆదిలాబాద్ జిల్లా బజార్ హట్నూర్ మండలం హర్కయిలో ఉండే కూతురు లలిత ఇంటికి వెళ్లారు. ఆనందంగా గడిపారు. అనంతరం మనువరాలు రితిక(04)తో కలిసి ద్విచక్ర వాహనంపై ముగ్గురు బయలుదేరారు. నెరడిగొండ మండలం వాంకిడి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో బచ్చన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలతో ఉన్న రితికను నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ప్రమాదంతో ఇరుగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.అదేవిధంగా నగర శివారులోని పెద్ద గోల్కొండ వద్ద కారుతో పాటే ఓ వ్యక్తి వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఎపి 27సీసీ 0206 నంబరు గల హోండా అమేజ్ కారులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు దావానంలా చెలరేగాయి. ఆ సమయంలో కారులోనే ఉన్న ఓ వ్యక్తి బయటికి రాలేక అందులోనే సజీవ దహనమయ్యాడు. కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.