హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ అభయారణ్యంలోని పలుచోట్ల మంటలు వ్యాపించాయి. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్, మన్ననూరు, దోమలపెంట రేంజ్లలోని ఈర్లపడెలు, బౌరెడ్డిబావి, తవిసిపెంట, తునికిమాను పెంట ప్రాంతాల్లో 15 చోట్ల మంగళ, బుధవారాల్లో మంటలు చెలరేగాయి. బ్లోయర్లు, ఫైర్ బీటర్లు, చెట్ల కొమ్మలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు అవస్థలు పడ్డారు.
శ్రీశైలం ప్రధాన రహదారి వెంట ఉన్న ఈర్లపడెలు ప్రాంతంలో అగ్నిమాపక యంత్రంతో మంటలను ఆర్పారు. అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారు 70 హెక్టార్ల మేర అడవికి నష్టం వాటిల్లి ఉంటుందని అమ్రాబాద్ రేంజ్ అధికారి తెలిపారు. చిన్నపాటి అజాగ్రత్తలతో తీవ్ర నష్టం వాటిల్లితోందని అధికారులు తెలిపారు. వాహనదారులు శ్రీశైలం.. హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో రోడ్లపై వంటలు వండటం, తినడం, చెత్తాచెదారం వేయొద్దని అధికారులు కోరారు.