Saturday, November 23, 2024

ఇది పక్కా రైతు వ్యతిరేక బడ్జెట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బిఆర్‌ఎస్ పార్టమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్‌సభలో పార్టీ నేత నామా నాగేశ్వర్‌రావులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలను నీరుగార్చే విధంగా ఉందని మండిపడ్డారు. కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపాందించినట్లుగా ఉందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. అసలు ఇది బడ్జెట్‌యేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను గురించి బడ్జెట్‌లో అసలు ఊసే లేదని విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా మరోసారి కేంద్రం తన వివక్షను ప్రదర్శించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్రంపై పార్లమెంట్‌లోనే తేల్చుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఇది నూటికి నూరుపాళ్లు పక్కా రైతు, గ్రామీణ, పేదల, తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ అని వారు వ్యాఖ్యానించారు.

బుధవారం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశవరావు, నామాలు మాట్లాడుతూ, కేంద్రంపై మరోసారి తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం కొన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం శోచనీయమని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను చూస్తుంటే కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మరిచిపోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షాన తాము ఎప్పటి నుంచో అడుగుతున్న ఏ ఒక్క దానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని వారు విమర్శించారు. ఏ ఒక్క దానికి పైసా నిధులు కేటాయించకుండా తీవ్ర వివక్షత చూపించిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏదో చేస్తుందని గ్రామీణ, బడుగు, పేద, బలహీన వర్గాల ప్రజలు ఎంతగానో ఆశగా ఎదురు చూశారన్నారు. తీరా బడ్జెట్ చూశాక అంతా అవాక్కయ్యారన్నారు. బడ్జెట్‌లో ఎక్కడా కనీసం రైతుల గురించిగానీ, తెలంగాణ గురించి కానీ ప్రస్తావనే రాకపోవడం సిగ్గుచేటన్నారు. కాలేశ్వరం లాంటి ఎన్నో ప్రాజెక్టులు, కాలువలు, నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగు, తాగు నీటిని అందించిన తెలంగాణ గురించిన ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఊసే లేకపోవడం అత్యంత దారుణమన్నారు.

రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చి, వారి ఆందోళనతో వెనక్కి తీసుకున్నారని, కానీ బడ్జెట్లో కూడా రైతుల ప్రయోజనాలను కేంద్రం పూర్తిగా విస్మరించిందని కెకె, నామాలు పేర్కొన్నారు. కనీస మద్దతు ధర చట్టబద్ధత గురించి ప్రస్తావన లేవన్నారు. కేంద్రానివన్నీ మాయ, మోసపు మాటలని ఈ సందర్భంగా వారు ధ్వజమెత్తారు. కర్నాటకలో మాత్రమే కరవు ఉందట… దేశంలో ఎక్కడా లేదా ? రూ.5,300 కోట్లు ఒక్క రాష్ట్రానికే ఇచ్చారని మండిపడ్డారు. మరి దేశంలో మిగతా రాష్ట్రాలు లేవా? ఆ ఆయా రాష్ట్రల్లో ప్రజలు లేరా? అని కేంద్రాన్ని నిలదీశారు. 9 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని…. అవి ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటి దాకా దాదాపు 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటిని సైతం ఊడగొడుతున్నారని వారు దుయ్యబట్టారు.

నీతి అయోగ్ సిఫార్స్ చేసిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇస్తారని అనుకున్నాం కానీ, పైసా ఇవ్వకుండా వివక్షత చూపించారని అన్నారు. నిధులు ఇవ్వకపోగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సైతం అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఫర్ క్యాపిటల్ ఇన్‌కంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ఒకప్పుడు రూ. 1,12,152 ఉంటే ఇప్పుడు రూ.2,75,443 ఉందన్నారు. అలాగే దేశంలో 153 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ లోపల, బయట పలు సందర్భాల్లో బిఆర్‌ఎస్ ఎంపీలు అనేక రకాలుగా పోరాటం చేసినా ఒక్కటి కూడా ఇవ్వలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనేక ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రం సొంత నిధులతో వాటిని ఏర్పాటు చేస్తోందన్నారు.

అన్ని విధాలుగా దేశ ప్రజలతో పాటు తెలంగాణకు అన్యాయం చేసినా కేంద్రాన్ని ఎట్టి పరిస్థితిలిలోనూ వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.కేంద్రం నిరంకుశ విధానాలపై పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పోరాడతామని వారు స్పష్టం చేశారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల్లోనూ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హెూదా, నిధులు కేటాయింపుల్లో ను, విభజన హామీల్లోనూ తీవ్ర వివక్షత చూపించిందని ధ్వజమెత్తారు. ఇది పేద, రైతు, మధ్య తరగతి ప్రజలను తీవ్ర అసంతృప్తికి, నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి ఏమి చెప్పనేలేదన్నారు. మరో వైపు విభజన చట్టం ఊసే లేదన్నారు. విద్యా, వైద్యానికి నిధుల్లో భారీగా కోత విధించారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన వేలాది కోట్ల బకాయిలు, నిధులు గురించిన ప్రస్తావనే లేదన్నారు. అన్నదాతను పూర్తిగా విస్మరించిన కేంద్రం తగిన మూల్యం చెల్లించకతప్పదని వారు స్పష్టం చేశారు.

రాష్ట్రాలను బలహీనం చేసే బడ్జెట్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాలను బలహీనం చేసే విధంగా ఉందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ రంగానికి మేలు చేసే విధంగా లేదన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదానిచ్చి నిధులు కేటాయించాలనే తెలంగాణ ప్రజల డిమాండ్ ను ఏ మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. కేంద్రం గతంలో 157 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే,అందులో ఒకటంటే ఒకటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు.

ఇప్పుడేమో నర్సింగ్ కాలేజీలు ఇస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు,అయితే వీటిలో కూడా తెలంగాణకు కేంద్రం అన్యాయమే చేసేటట్టు కనిపిస్తున్నన్నారు. అలాగే తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయకపోవడం, గిరిజన విశ్వవిద్యాలయానికి ఆశించిన రీతిలో నిధులివ్వకపోవడం,జిల్లాకో నవోదయ పాఠశాల,బయ్యారం స్టీల్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు గురించి ప్రస్తావించకపోవడం తీవ్ర విచారకరమని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర నీటి ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరు?
తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వారని కేంద్రాన్ని చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు,-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశామన్నారు. కానీ మళ్లీ కేంద్రం మొండి చెయ్యి చూపించిందన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి …. పక్క రాష్ట్రమైన కర్నాటకలో ఎన్నికలప్పుడు వారు అడగకుండానే ’అప్పర్ భద్ర డ్యాం’ కి జాతీయ హోదా ప్రకటించిందని విమర్శించారు. ఇక మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించక పోవడం అంటే హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమే కేంద్ర బిజెపి వైఖరని కేంద్ర బడ్జెట్ చూస్తే అర్థమవుతుందన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఒక్క కేంద్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రకటించక పోగా తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించే మెడికల్ కాలేజీలకు కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ప్రకటించక పోవడం బాధాకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News