భోపాల్ ఆస్పత్రి అగ్ని ప్రమాదంలో విషాద దృశ్యం
భోపాల్ : తల్లిగర్భం నుంచి పేగు తెంచుకుని పుట్టినా ఇంకా పేరు పెట్టకుండానే తమ చుట్టూ ఉన్న బాహ్యప్రపంచాన్ని చూడకుండానే ఆ నలుగురు పసికందుల ఊపిరిని కొన్ని క్షణాల్లో క్రూరమైన విధి ఆపేసింది. ఒక రోజు నుంచి తొమ్మిది రోజుల వయసున్న ఈ పసి మొగ్గలకు తమ తల్లిదండ్రులు ఇంకా పేరు పెట్టలేదు. ప్రభుత్వ నిర్వహణ లోని కమలా నెహ్రూ ఆస్పత్రి స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సియు)లో వీరు చికిత్స పొందుతుండగా సోమవారం రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి వీరి ప్రాణాలు గాలిలో కలసి పోయాయి.
వీరికి ఇర్ఫానా, శివానీ, షజ్మా, రచనా అని వారి తల్లిదండ్రులు పేరు పెట్టాలనుకున్నారు. కానీ పేరు లేకుండానే వారు ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. మొత్తం 40 మంది పిల్లలు ఎస్ ఎన్ సియు లో చేరగా వీరిలో 36 మంది వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. షార్టుసర్కూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే 36 మందిని వేరే వార్డుకు తరలించి కాపాడ గలిగినా ఆ నలుగురు పసికందులను మాత్రం కాపాడడం సాధ్యం కాలేదని మంత్రి విశ్వసారంగ్ చెప్పారు. ఈసంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.