జర్మనీ ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధన
బెర్లిన్ : జర్మనీ ఖగోళ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి తెల్ల మరుగుజ్జు నక్షత్రం నుంచి భయంకర నోవా విస్ఫోటనాన్ని కనుగొనగలిగారు. జర్మన్ రష్యన్ ఇ రోసిటా ఎక్స్‌రే టెలిస్కోప్ అందించిన డేటా సహాయంతో దీన్ని కనుగొన్నారు. ఈ టెలిస్కోప్ 9,00,000 మైళ్ల దూరంలో అంతరిక్షంలో ఉంది. దక్షిణ నక్షత్ర రాశిలో ఈ మరుగుజ్జు నక్షత్రం నుంచి నోవా విస్ఫోటనం జరిగింది. మన పాలపుంత లోని నక్షత్రాలు తమ ఇంధనం అంతా మండించుకుంటే అవి మరుగుజ్జు నక్షత్రాలుగా కుదించుకుపోతాయి. అయితే ఇవి మరుగుజ్జు అయినప్పటికీ పరిమాణంలో భూమిని పోలి ఉంటాయి. అలాగే ద్రవ్యరాశిలో సూర్యుడ్ని పోలి ఉంటాయి. సూర్యుని పరిమాణం అంత ఉన్న నక్షత్రాలకు ఇవి అవశేషాలుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
చివరకు భూమి అంత పరిమాణంలో కుదించుకుపోతాయి. అలాంటి తెల్ల మరుగుజ్జు నక్షత్రాలు ఒక్కోసారి అత్యంత భారీ విస్ఫోటనానికి గురవుతుంటాయి. ఎక్స్‌రే రేడియో ధార్మికత తాలూకు అగ్ని బంతిని సృష్టిస్తుంటాయి. ఇప్పుడీ నోవా విస్ఫోటనం రెండు తెల్ల మరుగుజ్జు నక్షత్రాల ద్వంద్వ విధానం వల్ల సంభవించింది. అంటే రెండు నక్షత్రాలు గురుత్వాకర్షణ బంధంతో ఏకమైనప్పుడు ఈ విస్ఫోటనం అగ్నిబంతిగా ప్రజ్వరిల్లింది. దీన్ని మొట్టమొదట సారి జర్మనీ శాస్త్రవేత్తలు టెలిస్కోప్ ద్వారా గుర్తించ గలిగారు. ఇ రోసిటా 2020 జులైలోనే ఈ విస్ఫోటనాన్ని గమనించినప్పటికీ ఇప్పుడు కొత్త అధ్యయనంలో పూర్తి వివరాలు తెలుసుకోగలిగారు.