బల్లియా(యుపి): అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తాను వెయ్యిరూపాయల విరాళం ఇవ్వనందుకు ఆర్‌ఎస్‌ఎస్ స్కూలు ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి తనను తొలగించారని యశ్వంత్ ప్రతాప్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణను స్కూలు ప్రిన్సిపాల్ కొట్టిపారేశారు. జగదీష్‌పూర్ ప్రాంతం సరస్వతీశిశు మందిర్‌లో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఇంతేకాకుండా తన ఎనిమిది నెలల వేతనాన్ని పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. ఆలయ విరాళాలు వసూలు కోసం రిసీట్ బుక్ తనకు ఇచ్చారని, ఆమేరకు వసూలైన రూ.80,000 వేలు జమ చేయడమైందని, కానీ తనను వెయ్యి విరాళంగా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని సింగ్ ఆరోపించారు. దీనిపై తాను లిఖితపూర్వకంగా జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనకు న్యాయం లభించకపోతే కోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. దీనిపై స్కూలు ప్రిన్సిపాల్ ధీరేంద్ర వివరిస్తూ ఉద్యోగులందరికీ రిసీట్ పుస్తకాలు ఇచ్చామని, సింగ్ కూడా మూడు పుస్తకాలు తీసుకున్నాడని, కానీ వసూలైన విరాళాలు డిపాజిట్ చేయకుండా రాజీనామా చేశారని తెలిపారు.