40 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు
బీజింగ్: చైనాలోని చోంగ్‌కింగ్ నగరంలోని జియాంగ్‌బీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం 127 మంది ప్రయాణికులతో బయల్దేరిన టిబెట్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో రన్‌వై పక్కకు ఒరిగిపోయి మంటలు చెలరేగడంతో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చోంగ్‌కింగ్ నుంచి స్వయంప్రతిపత్తి ప్రాంతమైన నయింగోచికి బయల్దేరిన ఈ విమానంలోని 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు టిబెట్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. స్వల్పంగా గాయపడిన 40 మందికి పైగా ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ తెలిపింది. విమానంలోని ఫ్యూయల్ ట్యాంకు వద్ద నుంచి మంటలు, దట్టమైన పొగ వ్యాపించడానికి సంబంధించిన వీడియోను చైనా సెంట్రల్ టెలివిజన్ ప్రసారం చేసింది. విమానంలోని వెనుక డోరు నుంచి ప్రయాణికులు తప్పించుకుని రన్‌వేపై పరుగెత్తుతున్న దృశ్యాలను టీవీ ప్రసారం చేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది విమానంలోని మంటలను ఆర్పివేసి రన్‌వైను మూసివేశారు.