ప్రయాణికులు సురక్షితం
మీరట్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరన్‌పూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలు ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయానిస్తున్న రైలులోని రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులే ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న రైలు ఇంజన్‌తోపాటు ఆ రెండు బోగీలను ఇతర బోగీల నుంచి వేరు చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం దౌరాలా స్టేషన్ సమీపంలో జరిగింది.
తెల్లవారుజామున 5.30 గంటలకు సహరన్‌పూర్‌లో బయల్దేరినఎక్స్‌ప్రెస్ రైలు గమ్యస్థానమైన ఢిల్లీకి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌరాలా స్టేషన్‌ను సమీపిస్తుండగా ఇంజన్‌కు వెనుక ఉన్న కంపార్ట్‌మెంట్ నుంచి పొగ రావడాన్ని ప్రయాణికులు గమనించారు. ఉదయం 7.10 గంటలకు రైలు దౌరాలను చేరుకునే సమయానికి రెండు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయని మీరట్ సిటీ రైలే స్టేషన్ సూపరింటెండెంట్ ఆర్‌పి శర్మ తెలిపారు. ఆ రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రయాణికులంతా సురక్షితమని ఆయన చెప్పారు. వెంటనే ఇతర బోగీల్లోని ప్రయాణికులు కూడా సహాయక చర్యల్లోకి దిగి ఆ రెండు బోగీల నుంచి ఇతర బోగీలను వేరుచేయడంతో పెను ప్రమదం తప్పింది.