Sunday, December 22, 2024

బాణాసంచా ఫ్యాక్టరీ పేలుళ్ల ఘటన: ఇద్దరు యజమానుల అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

హర్దా/భోపాల్: మధ్యప్రదేశ్ లో హర్దా పట్టణంలోని బాణాసంచా ఫ్యాక్టరీ పేలుళ్ల సంఘటనకు సంబంధించి ఫ్యాక్టరీ ఇద్దరి యజమానులు రాజేష్ అగర్వాల్, సోమేష్ అగర్వాల్‌లను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. రాజ్‌గఢ్ జిల్లా సారంగపూర్‌లో మంగళవారం సాయంత్రం వీరి అరెస్ట్ జరిగింది. ఈ ప్రమాదంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి రఫీక్ ఖాన్‌ను హర్దా శివారు బైరాగఢ్ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్టు హర్దా ఎస్‌పి సంజీవ్ కాంచన్ విలేఖరులకు వెల్లడించారు. హత్యానేరంపై కాకుండా దోషపూరిత నరహత్య(ఐపిసి 304), నిరాధారమైన నరహత్యకు యత్నం (సెక్షన్ 308), ఉమ్మడి ఉద్దేశం కోసం అనేక మంది చేసిన చర్యలు(34) ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందగా, 174 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

గాయపడిన వారిని, మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పరామర్శిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తులో ప్రశ్నించడానికి ఖాన్‌ను అరెస్టు చేశామని ఎస్‌పి తెలిపారు. ఫ్యాక్టరీ మేనేజర్‌గా ఖాన్ ఉంటున్నారు. అయితే ఫ్యాక్టరీలో పేలుళ్లకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద ప్రాంతాన్ని ఖాళీ చేయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ హెలికాప్టర్లను రప్పించ వలసి వచ్చింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది.

టపాసుల నిల్వల ఆరు గొడౌన్లు సీజ్
ఈ బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వహణలో అనేక అవకతవకలు కనిపించడంతో ఫ్యాక్టరీకి సంబంధించిన టపాసుల నిల్వలతో ఉన్న ఆరు గొడౌన్లను అధికారులు సీజ్ చేశారు. ఈ గొడౌన్లు జిల్లాలోని వేర్వేరు నివాస ప్రాంతాల్లో ఉన్నాయి. పరిమితికి మించి గొడౌన్లలో నిల్వలు చేయడమే కాక, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం తదితర లోపాలు బయటపడ్డాయని ఇండోర్ కలెక్టర్ ఆషిష్ సింగ్ విలేఖరులకు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News