Friday, December 20, 2024

నలుపుపై విషం చిమ్మిన తెలుపు

- Advertisement -
- Advertisement -

Firing at US super market:10 killed

అమెరికా సూపర్ మార్కెట్‌లో కాల్పులు
10 మంది నల్లజాతీయుల మృతి
బఫెల్లో ఆటవికం రిలేకు ఏర్పాట్లు
సైనిక దుస్తులు ఒంటికి కవచం

బఫెల్లో (అమెరికా) : ఇక్కడి టాప్స్ ఫ్రెండ్లీ సూపర్‌మార్కెట్‌లో 18 సంవత్సరాల తెల్లజాతీయుడు సాగించిన కాల్పుల్లో పది మంది మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన జాత్యాహంకార పూరిత హింసోన్మాదం అని అధికారులు నిర్థారించారు. టీనేజ్‌లో ఉన్న వ్యక్తి సాయుధుడై శరీరానికి కవచం, సైనిక దుస్తులల్లో మార్కెట్‌లోపలికి వచ్చాడు. లోపల అత్యధికంగా నల్లజాతీయులు షాపింగ్‌కు వచ్చారు. పనిచేసేవారు కూడా బ్లాక్‌లే ఉన్నారు. వీరిని గమనిస్తూ ఆ యువకుడు 11 మంది బ్లాక్‌లపై , ఇదే క్రమంలో ఇద్దరు తెల్లవారిపై విచక్షణారహితంగా రైఫిల్‌తో కాల్పులు సాగించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పైగా ఈ దారుణకాండను స్థానిక ప్రత్యక్ష ప్రసారాల వేదిక అయిన ట్విచ్చ్‌కు ప్రసారం అయ్యేలా తన శరీర దుస్తులలో ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఘట్టాన్ని కొద్ది సేపు ఆ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ముందు గమనించకుండా ప్రసారం చేసింది. తరువాత నిజఘటనగా నిర్థారించి ఈ ప్రసారాన్ని కట్ చేసింది.

రెండు నిమిషాల పాటు కాల్పులు సాగించిన ఈ యువకుడు అక్కడికి చేరుకున్న పోలీసులకు సరెండర్ అయ్యాడు. వెంటనే ఈ వ్యక్తిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ వ్యక్తిపై హత్యా అంతకు మించిన తీవ్ర అభియోగాలపై విచారణ చేపట్టారు. ఈ శ్వేతజాతీయ యువకుడు అణువణువునా జాతి వివక్ష, జాత్యాహంకార ధోరణిని రంగింరిచుకుని ఉన్నట్లు , ఉద్ధేశపూరితంగానే నల్లజాతీయుల సూపర్ మార్కెట్‌ను ఎంచుకుని కాల్పులకు దిగినట్లు, కాల్పుల ఘట్టానికి అత్యంత ప్రచారం కల్పించాలని కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు నిర్థారణ అయిందని, ఈ క్రమంలో అమాయక పౌరుల సముదాయంపై విద్వేషపు సామూహిక చర్యకు దిగినట్లు భావించాల్సి వస్తోందని ఈ వ్యక్తిని ఆ దేవుడు కూడా క్షమించబోడని , వేరేజన్మలోనూ తగు ఫలితం అనుభవించేలా చేస్తాడని స్థానిక గవర్నర్ కాథీ హోచుల్ స్పందించారు. కాల్పులకు దిగిన వ్యక్తిని న్యూయార్క్‌లోని కాంక్లిన్ ప్రాంతపు వ్యక్తి పేటన్ గెండ్రన్‌గా గుర్తించారు. న్యూయార్క్‌కు 320 కిలోమీటర్ల దూరంలోని బఫెల్లోకు వచ్చి ఈ యువకుడు అన్ని ఏర్పాట్లతో దాడికి దిగినట్లు నిర్థారించారు . ఇంతదూరం వచ్చి ఈ వ్యక్తి ఎందుకు దాడికి దిగాడనే అంశపై స్పష్టత రాలేదు. ఈ వ్యక్తి ఓ కారులో సూపర్‌మార్కెట్‌కు రావడం తరువాత అనుక్షణ ఘట్టాలు ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి.

సాయుధుడు సూపర్‌మార్కెట్ వెలుపల నలుగురిపై కాల్పులు జరపడం తరువాత విసురుగా లోపలికి రావడం వంటి పరిణామాలు అన్ని కూడా వెలుగులోకి వచ్చాయని బఫెల్లో పోలీసు కమిషనర్ జోసెఫ్ గ్రామాగ్లియా తెలిపారు. ఈ వ్యక్తి లోపలికి రాకుండా అక్కడి గార్డ్ కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్లు తగలకుండా ఆ వ్యక్తి ఇనుప వెస్టు ధరించి ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. అక్కడి గార్డును కూడా సాయుధుడు కాల్చి చంపి సూపర్ మార్కెట్‌లోపలికి వచ్చి రెండు నిమిషాలలోనే అక్కడ నెత్తురు పారించి బయటకు పరుగులు తీశాడని జోసెఫ్ చెప్పారు . ఏ వర్గం కూడా ఇటువంటి పీడకలను ఎదుర్కొరాదని , ఇటువంటివే మనను బాధిస్తాయి.పైగా పట్టరాని కోపాన్ని తెప్పిస్తాయని స్థానిక మేయర్ బైరన్ బ్రౌన్ వ్యాఖ్యానించారు. ఈ దారుణ ఘటనపై ప్రెసిడెంట్ బైడెన్‌కు పూర్తివివరాలు తెలియచేసినట్లు , ఆయన తీవ్రంగా స్పందించినట్లు వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రెటరీ తెలిపారు. ప్రెసిడెంట్ దంపతులు ఈ బాధితులు వారి ఆత్మీయుల కోసం ప్రార్థనలు జరిపినట్లు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News