ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతం లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ముందు ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్టు పోలీస్‌లు వెల్లడించారు. క్రై బ్రాంచితోపాటు స్థానిక పోలీస్‌లు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. దీనిపై సల్మాన్‌ఖాన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్‌తో షిండే మాట్లాడి ఖాన్‌కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు. గత ఏడాది మార్చిలో సల్మాన్ ను బెదిరిస్తూ ఆయన ఆఫీస్‌కు ఈ మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ జరిపిన పోలీస్‌లు, గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్టు ఎన్‌ఐఎ వెల్లడించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బ తీశారంటూ 2018 లో లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. ఇదే విషయంపై ఆయనకు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్టు పోలీస్‌లు వెల్లడించారు. 2023 ఏప్రిల్ లోనూ ఇదే తరహా బెదిరింపులు రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎక్స్ గ్రేడ్ భద్రతను వై ప్లస్‌గా అప్ గ్రేడ్ చేసింది.దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌కు నిత్యం భద్రతగా ఉంటున్నారు.