రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల గుర్తింపు
ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర అధికారులు
ఇప్పటివరకు 2,900 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ల వివరాల సేకరణ
అందులో 650 బోగస్ రిజిస్ట్రేషన్ల ద్వారా…
రూ.1120 కోట్లు ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్ తీసుకున్నట్టు అధికారుల గుర్తింపు
హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు వాణిజ్య పన్నులశాఖ అధికారులు గుర్తించారు. ఈ అనుమానాస్పద జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 2,900 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సంస్థలు, వ్యక్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 2,300 రిజిస్ట్రేషన్‌లను జీఎస్టీ అధికారులు పరిశీలించి వాటికి సంబంధించి సమగ్ర వివరాలను సేకరించారు. అందులో ఇప్పటివరకు 650 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు అధికారులు గుర్తించారు. వీటి ద్వారా రూ.1120 కోట్ల ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లతో భారీ ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొమ్మును దారి మళ్లీంచినట్టుగా అధికారులు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా లక్షకుపైగా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు
దేశవ్యాప్తంగా జీఎస్టీ నెట్‌వర్క్, రాష్ట్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా దేశవ్యాప్తంగా లక్షకుపైగా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటి ద్వారా వేల కోట్ల రూపాయల ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్ పేరున అక్రమార్కులు పొందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నకిలీల అట కట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని కేంద్రప్రభుత్వం నియమించింది. అదేవిధంగా రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులను సమన్వయం చేసేందుకు అటు రాష్ట్రం ఇటు కేంద్రం డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారు లను నోడల్ అధికారులుగా నియమించుకున్నారు. రాష్ట్రంలోని 12 వాణిజ్య పన్నుల శాఖ డివిజన్లు ఉండగా 120 సర్కిల్ పరిధిలో పది మందికి తక్కువ లేకుండా వ్యాపారుల వద్ద వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేయాలని వారి నుంచి బిల్లులను తీసుకోవాలని, బిల్లులు ఇవ్వని సంస్థలు, దుకాణాలపై చర్యలు తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఆయా డివిజన్‌ల అధికారులను ఆదేశించారు.
కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లులు లేవు
ఆయా సంస్థలు, వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వారి నుంచి ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్ మొత్తాన్ని వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు చాలామంది వ్యాపారులు కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదని జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. దీనిపై కూడా కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
చూపిన అడ్రస్‌లో ఆ సంస్థ లేకపోవడంతో…
ప్రస్తుతం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో రాష్ట్రంలో దాదాపు 2,900 రిజిస్ట్రేషన్లు నకిలీవని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చూపిన అడ్రస్‌లో ఆ సంస్థ లేకపోవడం ఉన్నప్పటికి వ్యాపార లావాదేవీలు చేయకుండా కాగితాల మీదనే వ్యాపారం చేసినట్లు చూపిస్తున్నారు. తద్వారా రిటర్న్ వేసి ఐటిసి తీసుకోవడం లాంటివి ఇందులో ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ 650 బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు రూ.1120 కోట్లు ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్ రూపేనా ప్రభుత్వ సొమ్మును దోచేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఆ సంస్థల, వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.162 కోట్ల ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్ మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు.