చెన్నై చెంగల్పట్టు మార్గంలో తొలి ఎసి రైలు నడక
చెన్నై : దక్షిణాదిన తొలి ఎసి ఇఎంయు శనివారం చెన్నై, చెంగల్పట్టు మార్గంలో నడిచింది. చెన్నై నగరం, పరిసర ప్రాంతాలకు రవాణా జీవనాడిగా అనేక మంది తరచు శ్లాఘిస్తుండే సబర్బన్ రైల్ నెట్‌వర్క్‌లో ఇది మరొక గణనీయ విజయం. దక్షిణాదిన ఇది తొలి ఎసి సర్వీస్ అని అధికారి ఒకరు తెలియజేశారు. దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ ఈ సర్వీసును నిర్వహిస్తున్నది. మామూలు ఇఎంయు బోగీలకు భిన్నమైన ఆటోమేటిక్ డోర్లు, ప్రయాణికుల సమాచార వ్యవస్థ వంటి సదుపాయాలను ఈ రైలులో కల్పించారు. చెన్నై బీచ్ నుంచి చెంగల్పట్టుకు తొలి సర్వీసును శనివారం ఉదయం 7 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులు ఎంతో ఉత్సాహంగా రైలు ప్రయాణాన్ని ఆస్వాదించారు.
ఈ సర్వీస్ లక్షం ప్రయాణికులకు ఇబ్బందిలేని, ఆహ్లాదకర ప్రయాణ అనుభవాన్ని కల్పించడం అని దక్షిణ రైల్వే తెలియజేసింది. ఐసిఎఫ్ తయారు చేసిన అత్యధునాతన 12కార్ ఎసి ఇఎంయులలో ‘సుమారు 5000 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగల సామర్థంతో మెట్రో తరహా సౌఖ్యాన్ని అందించే’ పలు ఆధునిక సదుపాయాలు కల్పించారు. దేశంలో ఎసి ఇఎంయు సర్వీసును మొదట ముంబయి సబర్బన్‌లో ప్రవేశపెట్టారు. అది క్రమంగా కమ్యూటర్లు, ముఖ్యంగా ఆఫీస్‌కు వెళ్లేవారి, మహిళా ప్రయాణికుల నుంచి ప్రోత్సాహం అందుకుంది. ముంబయిలో ఎసి ఇఎంయు విజయంతో చెన్నై సబర్బన్‌లో చెన్నై బీచ్ చెంగల్పట్లు సెక్షన్‌లో దీనిని ప్రవేశపెట్టడమైంది.
చెన్నై బీచ్ చెంగల్పట్టు, చెన్నై బీచ్ తాంబరం (రెండూ ఒకే సెక్టర్‌లో ఉన్నాయి) మార్గాల్లో సర్వీసులను నడుపుతారు. ఆదివారాల్లో మినహా వారంలో ఆరు రోజుల పాటు చెన్నై బీచ్ చెంగల్పట్టు (4 సర్వీసులు), చెన్నై బీచ్ తాంబరం (2 సర్వీసులు) మార్గాల్లో మొత్తం ఆరు సర్వీసులు నిర్వహించనున్నట్లు దక్షిణ రైల్వే తెలియజేసింది. దక్షిణ రైల్వే విడుదల చేసిన ధరల వ్యవస్థ ప్రకారం పది కిమీ దూరానికి కనీస టిక్కెట్ ధర రూ. 35, అత్యధిక ధర 5660 కిమీ దూరానికి రూ. 105. నెలవారీ సీజన్ టిక్కెట్ ధర దూరాన్ని బట్టి రూ. 620, రూ. 2115 మధ్య శ్రేణిలో ఉంటుంది.