Wednesday, January 22, 2025

ప్రథమ చికిత్సే పదివేలు!

- Advertisement -
- Advertisement -

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని మహాత్ముడు ఏనాడో చెప్పారు. గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలన్నది ఆయన ప్రగాఢ వాంఛ. అయితే మహాత్ముడి అనేక ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమైన జాతి నేతల పుణ్యమాని, ఆ మహానుభావుడి గ్రామ స్వరాజ్య ఆంకాక్ష సైతం అందనంత దూరంలోనే ఆగిపోయింది. పచ్చటి పొలాలను కబళించి, ఆకాశ హర్మ్యాలను నిర్మించి అదే అభివృద్ధి అంటూ రొమ్ములు విరుచుకుంటున్న ప్రభుత్వాల తీరుతో పల్లెసీమల రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికీ విద్య, వైద్య సౌకర్యాలు లేని పల్లెటూళ్లు భారతావనిలో బోలెడు! ముక్కుపచ్చలారని తమ పిల్లలకు దూరాభారాలకోర్చి చదువు చెప్పించలేని తల్లిదండ్రులు వారిని పసితనంలోనే పొలాల బాట పట్టిస్తున్నారు.

ఇక వైద్య సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పల్లెటూళ్ల సంగతి అలా ఉంచి, మండల కేంద్రాల్లోనూ ఎంబిబిఎస్ చదివిన డాక్టర్లు, కనీస సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులకు ఇప్పటికీ దిక్కులేదు.ఫలితంగా రోగం రొష్టూ వస్తే, గ్రామీణ వైద్యుల (ఆర్‌ఎంపి)ను ఆశ్రయించక పల్లె జనానికి తప్పడం లేదు. ఆర్‌ఎంపిలకు వైద్యశాస్త్రపరంగా డిగ్రీలేమీ ఉండవు. ఎంబిబిఎస్ లేదా ఆపై చదువులు చదివి డాక్టర్ డిగ్రీ తీసుకున్నవారి వద్ద కొంతకాలం పని చేసి, ఆ అనుభవంతో వైద్య సేవలు మొదలుపెట్టే ఆర్‌ఎంపిలు చేయవలసింది అక్షరాలా ప్రథమ చికిత్స మాత్రమే. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ‘దుకాణాలు’ తెరిచే కొందరు ఆర్‌ఎంపిలు తమ అర్హతానర్హతలను పక్కనబెట్టి, డాక్టర్లుగా చెలామణీ అవుతూ అమాయక జనాల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఆర్‌ఎంపిలు రోగికి మందుల చీటీ రాయడం, ఇంజక్షన్ ఇవ్వడం వంటివి కూడా నేరమే.

కానీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ఏకంగా బహుళ అంతస్తుల ఆస్పత్రులు నిర్మించి, వాటిలో రోగులకు పడకలు సైతం ఏర్పాటు చేసి, డబ్బులు దండుకున్న ఆర్‌ఎంపిలు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆర్‌ఎంపిల విధివిధానాల గురించి అవగాహన లేని గ్రామీణ ప్రాంత ప్రజలు జలుబు వచ్చినా, జబ్బు చేసినా వారినే ఆశ్రయిస్తూ, అనేక సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అర్హత లేకుండా వైద్యం చేయడాన్ని గర్హిస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఆర్‌ఎంపిలపై కొరడా ఝళిపించింది. స్థాయికి మించి వైద్యం చేస్తున్న గ్రామీణ వైద్యులను ఉపేక్షించబోమంటూ హెచ్చరికలు జారీ చేయడం శుభ పరిణామమే. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం ప్రకారం ఆర్‌ఎంపిలు రోగ నిర్థారణ చేసి, మందులు ఇవ్వడం, స్లైన్ ఎక్కించడం, అబార్షన్లు, కాన్పులు వంటివి చేయడం శిక్షార్హం. తమ పేరు ముందు ‘డాక్టర్’ అని పెట్టుకోకూడదని, క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోమ్ అంటూ బోర్డులు పెట్టి రోగులను తప్పుదారి పట్టించకూడదని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

కానీ తమ పేరు ముందు డాక్టర్ అని లేని ఆర్‌ఎంపిలను వేళ్లపై లెక్కపెట్టవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఆర్‌ఎంపిల ఉదంతం ఇలా ఉంటే, నకిలీ డాక్టర్ల బెడద కూడా పెచ్చుమీరిపోతోంది. తప్పుడు సర్టిఫికెట్లతో కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలనే బురిడీ కొట్టించి వైద్యులుగా చెలామణి అవుతూ, అడపాదడపా పోలీసులకు పట్టుబడుతున్న నకిలీల బాగోతాలు చూస్తూనే ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాలన్న సదుద్దేశంతో గత ప్రభుత్వం తెలంగాణలో పల్లె దవాఖానాల పేరిట ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఆస్పత్రిలోనూ ఒక ఎంబిబిఎస్ డాక్టర్‌తో పాటు కొంత మంది వైద్య సిబ్బందిని నియమించి ఉచిత వైద్య సేవలను కొంత వరకూ అందుబాటులోకి తెచ్చింది.

వీటిని విస్తరిస్తూనే, ఆర్‌ఎంపిలు అందించే వైద్య సేవలపై గ్రామీణుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రథమ చికిత్స చేసే ఆర్‌ఎంపిలకు తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడవచ్చు. వాస్తవానికి, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఆర్‌ఎంపిలకు ప్రభుత్వ ఆస్పత్రులలో కమ్యూనిటీ పారామెడికల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆర్‌ఎంపిల వైద్య సేవలకు నాణ్యతను జోడించడమే లక్ష్యంగా జిఒ 428ని జారీ చేసి, తదనుగుణంగా శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ఆరంభించారు. అయితే నిధుల లేమి కారణంగా దీనికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆర్‌ఎంపి, పిఎంపిలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. మునుపు ఆగిపోయిన ఈ శిక్షణకు మళ్లీ శ్రీకారం చుట్టి ఆర్‌ఎంపిల వైద్య సేవలను పరిపుష్టం చేస్తే, నాణ్యమైన ప్రథమ చికిత్సా సౌలభ్యాన్ని గ్రామాలకు అందుబాటులోకి తెచ్చిన పుణ్యమైనా పాలకులకు దక్కుతుంది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News