Sunday, December 22, 2024

ఇజ్రాయెల్ వీడి ఇండియాకు క్షేమంగా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తొలి దఫా భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు వచ్చింది. ఘర్షణల ఇజ్రాయెల్‌లో చిక్కుపడ్డ వేలాది మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ పేరిట కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా తొలి దశలో 200 మంది భారతీయులు క్షేమంగా పురిటి గడ్డకు చేరారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున వీరు ఇక్కడికి చేరుకున్నారు. భయాందోళనల రహిత స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. హమాస్ దాడులు, వీటిని దెబ్బతీసేందుకు సాగిస్తోన్న ఇజ్రాయెల్ వైమానిక దాడుల నడుమ ఇజ్రాయెల్‌లో ఉండటం శ్రేయస్కరం కాదని పలువురు భారతీయులు ఇంటిబాట పడుతున్నారు. ఇక్కడికి చేరుకున్న భారతీయుల బృందానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. వారికి ముకుళిత హస్తాలతో నమస్కారాలు చేశారు, భారతదేశానికి స్వాగతం అంటూ వారిలో కొందరికి కరచాలనం చేశారు.

సైరన్లతో లేవడం, షల్టర్లలో గడపటం తిరిగొచ్చిన భారతీయుల అనుభవం
2019 నుంచి ఇజ్రాయెల్‌లో ఉంటున్న పిహెచ్‌డి విద్యార్థి శాశ్వత్ సింగ్ తన భార్యతో పాటు ఇక్కడికి చేరుకున్నారు. తమకు అక్కడ తెల్లవారుజామునే సైరన్లతో నిద్రలేవడం జరిగేది. తాము సెంట్రల్ ఇజ్రాయెల్‌లో ఉంటున్నామని , ఇప్డు అక్కడి ఘర్షణ ఇకపై ఎటువంటి మలుపు తిరుగుతుందో చెప్పలేమని , తాను అక్కడ వ్యవసాయంలో పిహెచ్‌డి చేస్తున్నానని, ముందు ప్రాణాలు బాగుండాలని తాను ఇక్కడికి తిరిగి వచ్చానని తెలిపారు. భారతీయులను తిరిగి ఇక్కడికి తీసుకురావడం ప్రశంసనీయ ఉదాత్త చర్య అని కొనియాడారు. తిరిగి ఇజ్రాయెల్‌లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశిస్తున్నామని తెలిపిన సింగ్ , తమ క్షేమం గురించి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇ మొయిల్స్ ద్వారా సంప్రదిస్తూ వచ్చిందని, ఇందుకు తాను ప్రధాని మోడీకి, ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని చెప్పారు. తమకోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం షెల్టర్లు ఏర్పాటు చేసిందని, తాము అక్కడ ఇబ్బంది పడలేదని ఇక్కడికి తిరిగి వచ్చిన బెంగాల్‌కు చెందిన సుపర్ణోఘోష్ తెలిపారు. ఈ వ్యక్తి ఇజ్రాయెల్‌లో పిహెచ్‌డి చదువుతున్నారు.

హమాస్ దాడులు జరిగినప్పుడు తమకు వెంటనే సైరన్లు విన్పించాయని, అంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారని దీపక్ అనే విద్యార్థి తెలిపారు. చాలా సేపటివరకూ గత శనివారం దాడులు జరిగాయి. వీటికి దూరంగా ఇప్పుడు తాము తిరిగి వచ్చామని, అయితే తన స్నేహితులు కొందరు అక్కడనే ఉన్నారని , వారు క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నానని దీపక్ చెప్పారు. ఇక్కడికి చేరుకున్న వివిధ ప్రాంతాల వారు దేశంలోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు జరిగాయి.ఇప్పుడు ఇక్కడికి చేరుకున్న వారిలో పలువురు విద్యార్థినులు కూడా ఉన్నారు. అక్కడ పరిస్థితి భయానకంగా ఉందని వీరు తెలిపారు. తాము అక్కడికి విద్యార్థులుగానే వెళ్లామని , తాము అక్కడి పౌరులము కామని , సైరన్లు మోగినప్పుడల్లా తమకు భయం భయంగా ఉండేదని జైపూర్ నివాసి అయిన మినీ శర్మ తెలిపారు. ఆపరేషన్ అజయ్ తమకు ఊరట కల్పించిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడికి చేరిన విద్యార్థులు ఇతరులలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారే ఉన్నారు.
ఇజ్రాయెల్‌లో దాదాపు 18000 మంది ఇండియన్లు
ఇప్పుడు ఇజ్రాయెల్‌లో వివిధ వృత్తులలో , విద్యాభ్యాసాలలో దాదాపు 18వేల మంది వరకూ భారతీయులు పలు ప్రాంతాలలో ఉంటున్నారు. కొన్ని ప్రాంతాలలో వీరికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. కాగా గాజాలో కేవలం ముగ్గురు నలుగురు, వెస్ట్‌బ్యాంక్‌లో దాదాపు డజన్ మంది భారతీయులు ఉన్నారని గురువారం భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News