న్యూఢిల్లీ: పాలస్తీనాతో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి మొదటి విడతగా సుమారు 200 మంది భారతీయులు శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి తిరిగివచ్చారు. ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి తిరిగి రావాలని ఆశిస్తున్న భారతీయుల కోసం ఆపరేషన్ అజయ్ పురిట భారత ప్రభుత్వం ప్రత్యేక విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.
శుక్రవారం తెల్లవారుజామున అఅద్దె విమానంలో విద్యార్థులతోసహా సుమారు 200 మంది భారతీయులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. వారికి విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వారిలో ఇజ్రాయెల్‌లో 2019 నుంచి నివసిస్తున్న వ్యవసాయ పరిశోధకుడు శాశ్వత్ సింగ్ సింగ్ ఉన్నారు. బాంబుల మోతలు, సౌరన్లతో తాము నిద్రలేచామని, ఈ యుద్ధం ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందో అర్థం కావడం లేదని భార్యతో కలసి స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని, వెస్ట్ బ్యాంక్‌లో డజను మంది, గాజాలో ముగురు లేదా నలుగురు భారతీయులు నివసిస్తున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బగ్చి గురువారం వెల్లడించారు.
ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న వారిలో ఇజ్రాయెల్‌లోని బీర్‌షేబాలో గల బెన్ గురియన్ యూనివర్సిటీలో పిహెచ్‌డి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సుపర్ణో ఘోష్ కూడా ఉన్నారు. తాము షెల్టర్లలో తలదాచుకున్నామని, ఇజ్రాయెల్‌లో అనేక చోట్ల షెల్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, తామంతా సురక్షితంగా అందులో ఉన్నామని ఆయన చెప్పారు.