కెసిఆర్ సూటి ప్రశ్న
నాందేడ్: ‘పారిశ్రామికవేత్త అదానీపై ఉన్న ప్రేమ.. దేశ ప్రజలపై ఉండాలి కదా?’ అని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కిలో బొగ్గును కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదానీ కోసం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. ‘పవర్ సెక్టార్ చాలా ముఖ్యమైంది. విద్యుత్ రంగాన్ని ప్రయివేటుపరం చేయకూడదు. కానీ కేంద్రం అదానీ, అంబానీ,జిందాల్ పాట పాడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డంగా అమ్మేస్తున్నారు. అదానీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెను ముప్పు. ఇలాంటి కుట్రలపై బిఆర్ఎస్ పోరాటం చేస్తోంది. విద్యుత్ రంగాన్ని ప్రయివేటుపరం చేసినా, మేం జాతీయం చేస్తాం’ అన్నారు.
బొగ్గు గనులున్న అన్ని ప్రాంతాలకు రైల్వే లైన్లు వేస్తాం. రైల్వే లైన్ల కోసం కోల్ ఇండియా నిధులు ఇచ్చినా కేంద్రం వేయలేదు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం జబర్దస్తీ ఏంటి? అదానీకి ప్రయోజనం కలిగించడానికే బొగ్గు దిగుమతికి ఒత్తిడి. దేశంలో బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన అవసరమేలేదు. దేశంలో 90 శాతం విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే ఉంచుతాం. బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండేండ్లలోనే దేశంలో నిరంతర వెలుగులు తీసుకొస్తాం. న్యూయార్క్, లండన్‌లో కరెంట్ పోయినా హైదరాబాద్‌లో పోదు. హైదరాబాద్‌ను పవర్ హైల్యాండ్‌గా మార్చాం’ అని కెసిఆర్ స్పష్టం చేశారు.