Sunday, January 19, 2025

కశ్మీరుకు రాష్ట్ర హోదా కోసం తొలి క్యాబినెట్‌లో తీర్మానం

- Advertisement -
- Advertisement -

కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి
బిజెపిపై మా వ్యతిరేకత కొనసాగుతుంది
ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ ఎన్‌సి-కాంగ్రెస్ ప్రభుత్వం తమ తొలి క్యాబినెట్ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆఓమదిస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా బుధవారం వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలోనే జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళుతుందని ఆయన చెప్పారు.

ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూ కశ్మీరులో ప్రభుత్వం సజావుగా సాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమకు, ఢిల్లీకి తేడా ఉందని, ఢిల్లీ ఎన్నడూ రాష్ట్రం కాదని ఓమర్ చెప్పారు. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తామని ఎవరూ చెప్పలేదని ఆయన అన్నారు. 2019 ముందు వరకు జమ్మూ కశ్మీరు రాష్ట్రంగా ఉండేదని, రాష్ట్ర హోదాను కల్పిస్తామని ప్రధాని, హోం మంత్రి, కేంద్ర మంత్రులు వాగ్దానం చేశారని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీరులో నియోజకవర్గాల పునర్విభజన, శాసనసభ ఎన్నికలు, రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తామని వారు వాగ్దానం చేశారని ఓమర్ తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని, ఇప్పుడు ఎన్నికలు కూడా జరిగాయని, ఇక మిగిలింది రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడమేనని ఆయన తెలిపారు.

జమ్మూ కశ్మీరు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఎంతమేరకు ముఖ్యమని ప్రశ్నించగా కేంద్రంతో ఘర్షణ వల్ల సాధించేది ఏమీ లేదని ఓమర్ వ్యాఖ్యానించారు. బిజెపి రాజకీయాలను తాము ఆమోదిస్తామని తన ఉద్దేశం కాదని, బిజెపి పట్ల తమ వ్యతిరేకత కొనసాగుతుందని, అయితే కేంద్రాన్ని వ్యతిరేకించడం అన్నది తప్పనిసరి కాదని ఆయన వివరించారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉండడం వల్ల జమ్మూ కశ్మీరుకు, ఇక్కడి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించేందుకు గురువారం శాసనసభా పక్ష సమావేశాన్ని ఎన్‌సి ఏర్పాటు చేస్తుందని ఆయన తెఇపారు.

ఆ తర్వాత భాగస్వామ్య పక్షాలతో సమావేశమై కూటమి నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ లేఖ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పిడిపి కూడా భాగసామి అవుతుందా అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి అటువంటి చర్చలేవీ లేవని ఓమర్ స్పష్టం చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలను లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయడాన్ని గురించి ప్రశ్నించగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలను కలిపినా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పటికే కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని, వారు కూడా కలిస్తే తమ బలం మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. ఐదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వల్ల తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ఆయన తెలిపారు. 370వ అధికరణ పునరుద్ధరణ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఆ అధికరణను రద్దు చేసిన వారి నుంచే(కేంద్ర ప్రభుత్వం) పునరుద్ధరణను ఆశించడం అవివేకమని ఓమర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశాన్ని తమ పార్టీ సజీవంగా ఉంచుతుందని, దాని కోసం డిమాండు చేయడం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News