Thursday, January 23, 2025

అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆదివారం అర్థరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత ( బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష అధినియమ్(బీఎస్‌ఏ ) అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్‌డిఆర్‌ఎస్) పరిధి లోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్ కోడ్ లోని సెక్షన్ 285 కింద పోలీస్‌లు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కమిషనర్ సంజయ్ అరోరా ఈ కొత్త చట్టాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఢిల్లీ పోలీస్‌లు ప్రారంభించారని నిర్ధారించారు.

భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) లోని సెక్షన్ 285 ఏం చెబుతోందంటే ఎవరు ఏ పనిచేసినా, తనకున్న ఆస్తి లేదా తన అధీనం లోని ఆస్తి ద్వారా ప్రమాదం కలిగించినా, లేదా ఆటంకం కలిగించినా , ఏ వ్యక్తినైనా గాయపర్చినా, ప్రజల రాకపోకలకు భంగం కలిగించినా, రూ.5000 వరకు గరిష్టంగా జరిమానా పడుతుంది. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారిపై సోమవారం ఉదయం 12.15 గంటలకు ఫిర్యాదు అందిందని పోలీస్‌లు చెప్పారు. ఢిల్లీ లోని ఒక వీధి వ్యాపారి రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ , సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీస్‌లు గుర్తించారు. అతడి తాత్కాలిక దుకాణం ఎన్‌డీఆర్‌ఎస్ సమీపం లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కింద ఉంది. దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

దాంతో దానిని వేరే చోటుకు తరలించాలని అతడికి పోలీస్‌లు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేక పోయింది. దానివల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి కేసు నమోదు చేసినట్టు పోలీస్‌లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పోలీస్ పెట్రోలింగ్ అధికారి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేసు నమోదు చేశారు. ఆ దుకాణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు పోలీస్ ఆఫీసర్ ఈ ప్రమాణ్ యాప్‌ను ఉపయోగించారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఈ యాప్‌ను ఆపరేట్ చేసింది. యాప్‌లోని కంటెంట్ నేరుగా తదుపరి దర్యాప్తు కోసం పోలీస్ రికార్డులకు చేరుతుంది.ఆ వీధి వ్యాపారిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

30,000 మందికి ఢిల్లీ పోలీస్ శిక్షణ
ఎఫ్‌ఐఆర్ నమోదు, దర్యాప్తులకు బాధ్యులైన దాదాపు 30,000 మంది పోలీస్ అధికారులకు ఢిల్లీ పోలీస్ శిక్షణ చేపట్టింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు నుంచి ఇన్‌స్పెకరు,్ల అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల వరకు ఆయా ర్యాంకుల పోలీస్ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలపై దేశంలో శిక్షణ ప్రారంభించే పోలీస్ దళాల్లో ఢిల్లీ పోలీస్ మొదటిదిగా ఉంది. ఈలోగా ఢిల్లీ లోని కింగ్స్‌వే క్యాంప్‌లో ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ దినోత్సవం సందర్భంగా కొత్త క్రిమినల్ చట్టాలు ఈ విధంగా అమలు కావడం , ఢిల్లీలో సోమవారం తొలికేసు నమోదు కావడం అదృష్టంగా పోలీస్ చీఫ్ అరోరా విలేకరులకు వెల్లడించారు.

ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా కచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం , మూకదాడి తదితర నేరాలకు ఇంతకుముందు ఐపీసీలోప్రత్యేకంగా సెక్షన్లు లేవు. దీంతో గందరగోళం ఏర్పడేది. భారత న్యాయసంహితలో ఆ లోటును పూడ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News