సనా: యెమెన్ రాజధాని సనా నుంచి దాదాపు ఆరేళ్ల తర్వాత మొట్టమొదటి పౌర విమానం సోమవారం బయల్దేరింది. అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్న యెమెన్‌లో అంతర్జాతీయంగా గురింపు పొందిన ప్రభుత్వానికి, హోతీ తిరుగుబాటుదారులకు మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మేరకు సోమవారం 151 మంది ప్రయాణికులతో యెమెన్ ఎయిర్‌వేస్ విమానం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు బయల్దేరి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఆడెన్ నగరం నుంచి వచ్చిన ఈ విమానానికి సనా విమానాశ్రయంలో సంప్రదాయకంగా ఘన స్వాగతం లభించింది. అధికారిక ప్రభుత్వానికి, ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య ఐక్యరాజ్యసమితి కుదిర్చిన 60 రోజుల సంధిలో భాగంగా పౌర విమానాల రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2 నుంచి ఈ శాంతి ఒప్పందం యెమెన్‌లో అమలులోకి వచ్చింది. ఒప్పందంలో భాగంగా వారానికి రెండు వాణిజ్య విమానలు సనా నుంచి జోర్డాన్, ఈజిప్టుకు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.