కోల్‌కతా : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో మెడికో హత్యాచారం కేసులో దిగువ కోర్టు విధించిన శిక్ష సరిపోదని వాదిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌కు అనుమతిపై నిర్ణయానికి ముందు సిబిఐ, హతురాలి కుటుంబం, నిర్ధారిత దోషి వాదనను తాము వింటామని కలకత్తా హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఈ వ్యవహారాన్ని ఈ నెల 27న విచారిస్తామని హైకోర్టు తెలియజేసింది. తాను ప్రాసిక్యూటింగ్ సంస్థ కనుక శిక్ష సరిపోదనే కారణాలపై అప్పీల్ చేసే హక్కు తనకు ఉంటుందని పేర్కొంటూ సిబిఐ కేసులో అప్పీల్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం హక్కుకు అభ్యంతరం తెలియజేసింది. నిరుడు ఆగస్టు 9న ఉత్తర కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై హత్యాచారానికి గాను దోషి సంజయ్ రాయ్‌కు మరణించేంత వరకు జీవిత ఖైదు శిక్షను సీల్డా కోర్టు సోమవారం విధించిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను అనుమతించాలా వద్దా అనే విషయమై నిర్ణయానికి ముందు తాము సిబిఐ, హతురాలి కుటుంబం, దోషి తరఫు న్యాయవాదుల ద్వారా వారి వాదనలు వింటామని జస్టిస్ దేబాంగ్షు బసక్ సారథ్యంలోని ధర్మాసనం వెల్లడించింది.
రాయ్‌కు మరణ శిక్ష విధించాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కిశోర్ దత్తా కోరుతూ, దోషికి మరణించేంత వరకు జీవిత ఖైదు అనుభవించాలన్న తీర్పు సరిపోదని కోర్టు ముందు వాదించారు. అప్పీల్‌ను కోర్టు అనుమతించాలని ఆయన అభ్యర్థిస్తూ, ప్రాసిక్యూటింగ్ సంస్థ, హతురాలి కుటుంబం, దోషితో పాటు రాష్ట్రం కూడా శిక్ష పరిమాణాన్ని సవాల్ చేయవచ్చునని అన్నారు. హత్యాచారం కేసు దర్యాప్తు బాధ్యతను నిరుడు ఆగస్టు 13న సిబిఇకి కలకత్తా హైకోర్టు బదలీ చేయడానికి ముందు కోల్‌కతా పోలీసులు కేసును దర్యాప్తు చేశారని బెంచ్‌కు దత్తా తెలియజేశారు, బెంచ్‌లో జస్టిస్ మహమ్మద్ షబ్బార్ రషీదీ కూడా ఉన్నారు. సిబిఐ తరఫున హాజరైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్‌దీప్ మజుందార్ రాష్ట్ర ప్రభుత్వ వాదనను వ్యతిరేకించారు. శిక్ష సరిపోదనే కారణంగా విచారణ కోర్టు ఉత్తర్వుపై అప్పీల్ చేసే హక్కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రాయ్‌కు మరణ శిక్ష విధించాలని విచారణ కోర్టును సిబిఐ అభ్యర్థించిందని ఆయన తెలియజేశారు.