తీసుకోని వారందరికి వేసేందుకు వైద్యసిబ్బంది చర్యలు వేగం
ఇప్పటికే మొబైల్ వాహనాలు, ఆరోగ్య కేంద్రాల్లో టీకా
గ్రేటర్ పరిధిలో 90శాతం పూర్తి చేసినట్లు వైద్యశాఖ వెల్లడి
రేపటి నుంచి ఇంటింటికి తిరిగి ఇవ్వనున్న ఆరోగ్య కార్యకర్తలు
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి టీకా పంపిణీ చేస్తున్న వైద్యశాఖ సిబ్బంది
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మొదటి డోసు టీకా పంపిణీ ఈనెలావరకు పూర్తి చేసేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు వేగం పెంచారు. మొబైల్ వాహనాలతో పాటు, స్దానిక ఆరోగ్య సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు. ఇకా టీకాపై అవగాహన లేనివారుంటే వారికి ఇంటింటికి తిరిగి పంపిణీ చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు సిద్దమైతున్నారు. ఇప్పటికే 90శాతం మందికి పూర్తిగా మరో 10శాతం మందికి వారం రోజుల్లో పూర్తి చేసి దేశంలోని మహానగరాల టీకా పంపిణీలో మొదటి స్దానంలో నిలుచుతామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జనవరి నుంచి నేటివరకు 76 లక్షలమందికి మొదటి డోసు వేసినట్లు, మిగతా వారిందరికి త్వరలో పూర్తి చేసిన సెప్టెంబర్ నుంచి సెకండ్ డోసు ప్రారంబించి నెల రోజుల్లో వారికి కూడా పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి సెకండ్ వేవ్ ముగియగా, వాతావరణ పరిస్దితుల బట్టి ఒకవేళ థర్డ్‌వేవ్ వచ్చిన దీటుగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు.
ప్రజలు కరోనా మహమ్మారి గురించి భయాందోళన చెందాల్సిన అవసరంలేదని, ఆసుపత్రుల్లో కూడా పడకలు, అక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బంది సరిపడ అందుబాటులో ఉంచామని వివరిస్తున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి అయితే ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తుందని పేర్కొంటున్నారు. అందుకోసం ముందుగా మొదటి డోసు తీసుకోని వారందరిని గుర్తించి, వారికి పూర్తి చేసి, తరువాత సెకండ్ డోసు కావాల్సిన వారికి పంపిణీ చేస్తామని వైద్యాదికారులు తెలిపారు. గత పది రోజలు నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరోగ్య సెంటర్లే కాకుండా 74 మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి మొదటి డోసు టీకా కావాల్సిన వారికి అక్కడే ఆధార్‌కార్డు ద్వారా కోవిన్ యాప్‌లో పేరు నమోదు చేసి టీకా పంపిణీ చేస్తున్నారు.
సెకండ్ డోసు గడువు సమీపించిన వారికి కూడా టీకా వేస్తున్నామని, ఎక్కువశాతం మొదటి డోసు వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు, సమీప ప్రాంతంలో ఎవరైనా కూలీలు , భవన నిర్మాణ కార్మికులు ఉంటే వెంటనే వారికి టీకాపై అవగాహన చేసి, తీసుకునేలా చేయాలని స్దానిక ప్రజలను మొబైల్ వాహనాల వైద్యసిబ్బంది కోరుతున్నారు. మొబైల్ వాహనాల ద్వారా బస్తీ, కాలనీల్లో జనసమూహం ఉండే ప్రదేశంతో పాటు మార్కెట్లు, కార్యాలయాలు, బ్యాంకుల వద్ద వాహనం నిలిపి కావాల్సిన వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. గ్రేటర్ మూడు జిల్లాలో 118 వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకా వేశారు. ప్రస్తుతం ఆసెంటర్లతో పాటు మొబైల్ వాహనాల ద్వారా త్వరగా వ్యాక్సిన్ పంపిణీ చేసి నగర ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా చేస్తామని వైద్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.