Monday, December 23, 2024

థాకర్సే మహిళా విశ్వవిద్యాలయం

- Advertisement -
- Advertisement -

అన్న దానం ఆకలిని తీర్చగలిగితే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఒక పురుషుడు విద్యావంతుడైతే అభివృద్ధి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదే ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉంటాయి.19వ శతాబ్దంలో భారత దేశంలో మహిళా విద్య, సాధికారత, అభ్యుదయం కోసం రాజా రామ్ మోహన్ రాయ్, స్వామీ వివేకానంద, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, బాలశాస్త్రి జంబేకర్, విట్టల్ రాంజీ షిండే, గోపాల్ హరి దేశముఖ్, అనిబీసెంట్, కందుకూరి వీరేశలింగం, పెరియార్ ఇవి రామస్వామి, దొండో కేశవ కార్వే లాంటి ఎందరో సంఘ సంస్కర్తలు అవిరళ కృషి చేశారు. కాగా దొండో కేశవ కార్వే ప్రత్యేకించి మహిళల కోసం 1916 జూన్ 2న కేవలం ఐదు మంది విద్యార్థులతో భారత దేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం భారతీయ మహిళా విశ్వవిద్యాలయం స్థాపించి మహిళాభ్యుదయం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.1920లో ఈ విశ్వవిద్యాలయం పేరును నతీబాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయం లేదా ఎస్‌ఎన్‌డిటి ఉమెన్స్ యూనివర్శిటీ గా మార్చారు.

1931లో తన మొదటి కళాశాలను ముంబైలో స్థాపించిన ఎస్‌ఎన్‌డిటి విశ్వవిద్యాలయం ఐదు సంవత్సరాల తర్వాత ప్రధాన కార్యాలయాన్ని ముంబైకి మార్చింది. 1949లో భారత ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని చట్టబద్ధమైన విశ్వవిద్యాలయంగా గుర్తించింది. ఎస్‌ఎన్‌డిటి విశ్వవిద్యాలయం, మహిళల కోసం కార్వే ప్రారంభించిన ఇతర విద్యా సంస్థలు ప్రస్తుతం ప్రీ -ప్రైమరీ పాఠశాలల నుండి హ్యుమానిటీస్, సైన్సెస్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లోని కళాశాలలలో వివిధ అంశాలను బోధిస్తున్నాయి. ప్రాచీన కాలంలో హిందూ సాంఘిక ఆచారాలు, కట్టుబాట్లు బాలికల విద్య పట్ల విముఖంగా ఉండడంతో పాటు సాధారణంగా తల్లిదండ్రులు తమ కుమార్తెలకు యుక్తవయస్సు రాకముందే వారికంటే వయసులో స్వల్ప తేడా ఉండే బాలురతో బాల్య వివాహాలు చేయడమే కాక పలు సందర్భాలలో వారికంటే వయసులో ఎంతో పెద్దవారు లేదా భార్యను కోల్పోయిన వ్యక్తులతో కూడా పునర్వివాహం జరిపించేవారు. అయితే నాటి సాంఘిక విధానాలు మాత్రం వితంతువుల పునర్వివాహాల పట్ల పూర్తి విముఖంగా ఉండేవి.

ఈ నేపథ్యంలో ఒక భర్త మరణిస్తే, అవిద్య, ఆర్ధిక స్వాతంత్య్రం లేకపోవడంతో అతని వితంతువు శేషజీవితం అగమ్యగోచరంగా మారిపోయేది. గత్యంతరం లేని పరిస్థితులలో ఆ వితంతువు తన దివంగత భర్త కుటుంబానికి సేవ చేస్తూ దుర్భర జీవితాన్ని గడపవలసి వచ్చేది.ఆ రోజుల్లో వితంతువుల దయనీయమైన పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన ఆయన వారి అభ్యున్నతి కోసం పని చేయడానికి కంకణ బద్ధుడయ్యాడు. ఆయన ప్రధానంగా మహిళా సంక్షేమం, ప్రత్యేకించి – విద్య, వ్యక్తిగత స్వేచ్ఛ, వితంతువుల పునర్వివాహం, కులతత్వ నిర్మూలన కోసం ఎంతో పాటుపడ్డారు. అలనాటి సాంఘిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించే మహర్షి కార్వే అభ్యుదయ భావజాలం, పట్టుదలతో స్త్రీ జాతికి వ్యతిరేకంగా పైన పేర్కొన్న కఠినమైన సామాజిక కట్టుబాట్లను ఛేదించడంలో భారత దేశంలోని సంఘసంస్కర్తలలో ఒకరిగా ఎదిగారు. అతను స్త్రీ విద్యను ప్రోత్సహించడంతో పాటు వితంతువులు పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి స్వేచ్ఛ, తోడ్పాటును అందించేవారు. భారత ప్రజానీకం ఆయనను మహర్షి (గొప్ప జ్ఞాని) గా సంబోధించడం ఆయనపట్ల వారికి గల గౌరవాన్ని సూచిస్తుంది.

తన మొదటి వివాహం గురించి ప్రస్తావిస్తూ కార్వే ఆత్మకథలో ఇలా వివరించారు: … నాకు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. అప్పుడు నా భార్యకు ఎనిమిదేళ్లు. ఆమె కుటుంబం మా కుటుంబానికి చాలా సమీపంలో నివసించడంతో మేము కలిసి ఆడుకునేవాళ్ళం. అయితే, వివాహం తర్వాత, మేము ప్లేమేట్స్‌గా మా పాత సంబంధాన్ని మరచిపోయి, అపరిచితులలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఒకరినొకరు కలుసుకున్నప్పటికీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మా సోదరి ద్వారా పరస్పరం సందేశాలు పంపుకోవలసి వచ్చింది. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నా వైవాహిక జీవితం ఇరవై ఏళ్ళ వయసులో మురుద్‌లో ప్రారంభం కాగా, 1891 లో రాధాబాయ్ 27 సంవత్సరాల వయస్సులో కొడుకు రఘునాథ్ కార్వేకు జన్మనిచ్చి ప్రసవ సమయంలో మరణించింది. వితంతు వివాహాలకు వ్యతిరేకంగా అప్పటికే ప్రబలంగావున్న కఠినమైన సామాజిక విధానాలు రాధాబాయి మరణంతో కార్వే మనస్సును మరింత బలంగా కుదిపేసింది.

ఒక సంఘ సంస్కర్తగా ఆదర్శభావాలను కేవలం ప్రవచించడమేకాక ఆచరణాత్మకంగా పాటించి చూపేందుకు ఆయన అసాధారణ ధైర్యంతో రెండు సంవత్సరాల తర్వాత, నాటి సామాజిక ఆచారాల ప్రకారం అవివాహితను పెళ్ళి చేసుకునే అవకాశం వున్నప్పటికీ, అప్పటికే వివాహం అయ్యి, మూడు నెలలకే 8 సంవత్సరాల వయస్సులో వితంతువుగా మారిన 23 ఏళ్ల గోధుబాయిని పునర్వివాహం చేసుకున్నాడు. కార్వేను వివాహం చేసుకునే నాటికే గోధుబాయి పండిత రమాబాయి మార్గదర్శనంలో నిర్వహింపబడుతున్న శారదా సదన్‌లో మొట్టమొదటి వితంతు విద్యార్థినిగా కొనసాగుతూ వితంతువుల పునర్వివాహాలకు వ్యతిరేకంగా సామాజిక ధర్మాలను ధిక్కరించడంలో కార్వే లాగా అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు. మొదటి భార్య మరణానంతరం, ఒక వితంతువును పునర్వివాహం చేసుకోవడం ఛాందస భావాలు గల ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు సమర్ధించనప్పటికీ ఆయన దానిని ఖాతరు చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News