చివరివారంలో దరఖాస్తులు ప్రారంభమయ్యే అవకాశం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్‌ఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ పరీక్షలు వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం తరహాలోనే వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు కూడా నాలుగు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరిలో మొదటి సెషన్,ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వరుసగా రెండు, మూడు, నాలుగు సెషన్లు నిర్వహించే అవకాశాలున్నాయి. సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సహా ఇతర రాష్ట్రాల 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి జెఇఇ మెయిన్ తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. జెఇఇ మెయిన్‌కు సంబంధించి ఈ నెల చివరి వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
2021 జెఇఇ మెయిన్‌లో అనుసరించిన విధానాలనే 2022 జెఇఇ మెయిన్‌లో కూడా అనుసరించనున్నారు. విద్యార్థులు ఏ సెషన్ పరీక్షకు హాజరు కావాలనుకుంటే ఆ సెషన్‌కు పరీక్ష ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఒకవేళ మొదటి సెషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా తర్వాతి పరీక్షలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు. అలాగే నాలుగు సెషన్లకు హాజరు కావాలనుకుంటే ఒకేసారి అన్ని సెషన్ల ఫీజు చెల్లించడం, లేదంటే తర్వాతైనా దరఖాస్తు చేసుకునేలా విద్యార్థులకు వెసులుబాటు కల్పించనున్నారు.