హన్మకొండ ప్రతినిధి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ సక్రమంగా జరగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం ఏనుమాముల మార్కెట్‌లోని ఈవీఎంల గోడౌన్‌లో ఫస్ట్ లెవల్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోడౌన్ తెరిచి ఎఫ్‌ఎల్‌సీ చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న మొదటి స్థాయి తనిఖీని పరిశీలించేందుకు ఇంజినీర్ల బృందం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు.
వీరి సమక్షంలో ప్రతీ ఈవీఎం మాక్ పోలింగ్ నిర్వహిస్తారన్నారు. మాక్ పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల పాటు తనిఖీ ప్రక్రియ నిర్వహించనున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ సం ధ్యారాణి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.