10న ఆదిలాబాద్‌లో జనగర్జనలో అమిత్ షా
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నగారా మోగనుండటంతో బిజెపి అభ్యర్థుల ఎంపికపై జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించాయి. ఏకాభిప్రాయం ఉన్న 40 మందితో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపించింది. అమావాస్య తరువాత ఈ నెల 16న 38 మందితో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు బిజెపి శ్రేణులు తెలిపారు. ఏకాభిప్రాయం రాని మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది. మొత్తం 3 జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనుంది.
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అగ్రనేతలతో ఒక దఫా ప్రచారం పూర్తి చేయాలని భావించిన కమలం పార్టీ 3 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రెండుసార్లు రాష్ట్రానికి రప్పించింది. పాలమూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మోడీ.. నిజామాబాద్ గడ్డ నుంచి బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నెల 10వ తేదీన ఆదిలాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఆదిలాబాద్‌లో ఆ రోజు మధ్యాహ్నం జనగర్జన సభ పేరుతో నిర్వహించే సభలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ సభ తర్వాత సాయంత్రం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులు, వృత్తి నిపుణులతో ఇంటరాక్టివ్ సెషన్‌లో అమిత్ షా పాల్గొంటారు.