Saturday, December 21, 2024

ఆధునిక తొలి స్త్రీవాద పద్య కవయిత్రి

- Advertisement -
- Advertisement -

భారతీయ సాహిత్యంలో చంద్ర గ్రహాన్ని చంద్రుడిగా పుమ్ లింగంగా చూసిన సంప్రదాయాన్ని పక్కకు పెట్టి కొత్త ఒరవడిగా స్త్రీ లింగంగా చెప్పిన ఆధునిక ప్రయోగం. చంద్రుణ్ణి చంద్ర బింబం అనే పేరు గల భార్యగా, రాహువును భర్తగా, నక్షత్రాలు వారి పిల్లలుగా, భూమి నుంచి వెళ్లిన ఆర్యభట్టును చుట్టముగా పెట్టి సంసారంలో మహిళగా చంద్రబింబం పడుతున్న క్షోభను చిత్రీకరించినది.

కవయిత్రి తిలక, అభినవ మొల్ల బిరుదులు, హంస, కీర్తి పురస్కారాల గ్రహీత, ప్రథమ స్త్రీవాద ప్రబంధ కర్త, నూతన పోకడల ప్రయోగశీలి, సాహితీ సామ్రాజ్య పట్టపురాణి, అక్షరవాణి, కవితల బాణి కొలకలూరి స్వరూప రాణి(పుట్టింటి పేరు నడకుర్తి రత్నజా స్వరూప రాణి). పద్య కవిత్వంలో దిట్ట. గేయ కవిత్వం హైకూలు, రుబాయిలు, ద్విపద కావ్యాలు, గజల్స్, పౌరాణిక నృత్య నాటికలు, పరిశీలన గ్రంధాలు, విశ్లేషణ గ్రంధాలు దాదాపు 20 పద్య, గద్య, వచన, కవితా గ్రంథాలని వెలువరించారు. తెలుగు సాహిత్యంలో హైకూల ప్రక్రియను సాహితీకరించిన మొదటి రచయిత్రిగా ప్రస్తుతించబడినవారు, కొలకలూరి స్వరూపరాణి. భక్తాంజలి, ఏసుక్రీస్తు వాదన అనే దండకాలు, గంగావతరణ శివతాండవము (ద్విపద కావ్యం 1979), చంద్రగ్రహణం (పద్య ప్రబంధం 1980) ప్రబోధం (వచన కవితా సంపుటి) నన్నయ మహిళ (విమర్శనాత్మక గ్రంథం 1985) ప్రణయ కుంతి, కరువు చెరలో రైతాలు, వాయు నందన శతకం, గోల పడవ (స్వీయ ఆంగ్లాను వాదంతో హైకూ సంపుటి) అనే రచనలు బహుళ ప్రాచుర్యం పొందినవి.

గుంటూరు జిల్లా తెనాలి గోవాడ గ్రామంలో 1-5 -1943లో జన్మించారు. తల్లి ఇంటూరి మంగమ్మ ఉపాధ్యాయురాలు. ‘ప్రథమ సౌందర్యం’ కథా రచయిత్రి. తండ్రి నడకుర్తి వెంకట రత్నకవి జిల్లా బోర్డ్ ఆఫీసులో క్లర్క్, స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితం అనుభవించాడు. ఇతడు సంస్కృతాంధ్రంలో పాండిత్యం ఉన్న గొప్ప కవి. శివకేశవుల యుద్ధం (పద్యనాటకం), ధ్యానాంజలి, బాలకోటేశ్వర తారావళి, మహోదయం పద్యకవిత్వం, ప్రాణం తీసిన దానం (కుల నిర్మూలన సామాజిక నాటకం) ఆనాడు జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ విముక్తితో పాటు కుల సమాజాలు కూడా విముక్తి జరగాలనే చైతన్యంతో పద్యకావ్యాలు, నాటకాలు రాసినవాడు ‘కవి భూషణ’ బిరుదాంకితుడు. చదువులేని ఎస్సీ పిల్లల్ని మిషనరీ బడుల్లో విస్తృతంగా చేర్పించి, వారు విద్యావంతులు కావడానికి విశేష కృషి చేసిన చరిత్ర కొలకలూరి స్వరూపరాణి తల్లిదండ్రులది. ఇల్లంతా సాహితీకారులతో కళాకారులతో కళకళలాడుతూ ఉండేది. కొలకలూరి స్వరూపరాణి కుటుంబాలు మిషనరీస్ స్కూళ్లల్లో చదువుకున్న దళిత క్రైస్తవులు. స్వరూపరాణి గుంటూరులో చదువుకొని, టీచర్ ట్రైనింగ్ చేసి అనంతపురం జిల్లా సోమఘట్టలో, ప్రకాశం జిల్లాలోనూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేసినారు. తల్లిదండ్రులు సాహితీకారులు కావడంతో, ఇంటి వాతావరణమంతా సాహితీమయంగా ఉండడంతో, తన చిన్ననాటి నుంచే పద్యాలు అల్లడం మొదలైంది. అట్లా ‘గైడు కానుక’ అనే కవిత ‘స్కౌట్ ’ అనే పత్రికలో అచ్చయిన తన మొదటి కవిత.

స్వరూపరాణి తండ్రి నడకుర్తి వెంకట రత్నకవి సంస్కృతాంధ్ర ఆంగ్ల పండితుడైనా, జాతీయఉద్యమంలో సంఘసంస్కర్తయినా, తలిదండ్రులకు శిష్యులుగా వున్న ఆధిపత్య కులం వాళ్ళు కూడా తమని చిన్నచూపు చూడడాన్ని నిరసిస్తూ చిన్ననాడే పద్యాలు అల్లింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంస్కృత, ఆంగ్లంలో పాండిత్యం సంపాదించి అగ్రహార సంస్కృత పండితులకంటే దీటుగా, మేటిగా, దేశీ, మార్గ చందస్సులతో పద్యరచనలు చేసిన సాహితీ ప్రతిభామూర్తి కొలకలూరి స్వరూపరాణి. ‘ఆంధ్ర కవయిత్రులు’ పుస్తకంలో ఒక్క దళిత కవయిత్రిని కూడా ప్రస్తావన చేయని ఉట్కూరు లక్ష్మీకాంతమ్మ ఆ పుస్తక మలి ముద్రణ (1980)లో కొలకలూరి స్వరూపరాణిని గొప్ప పద్య కవయిత్రిగా కొనియాడక తప్పలేదంటే, స్వరూపరాణి రచనా ప్రతిభా పాటవాలు ఎంత ప్రభావితంలో అర్థమవుతుం ది. ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు బేతవోలు రామబ్రహ్మం ‘చంద్ర గ్రహణం’ పద్య కావ్యాన్ని సమీక్ష చేస్తూ కొలకలూరి స్వరూపరాణి తొలి దళిత స్త్రీవాద కవయిత్రిగా కొనియాడాడు.

1974లో భారత ప్రభుత్వం ఆర్యభట్టు ఉపగ్రహాన్ని పంపించిన సందర్భాన్ని పురస్కరించుకొని ‘చంద్ర గ్రహణం’ అనే స్త్రీవాద ప్రబంధ పద్య కావ్యాన్ని రాసింది. భారతీయ సాహిత్యంలో చంద్ర గ్రహాన్ని చంద్రుడిగా పుమ్ లింగంగా చూసిన సంప్రదాయాన్ని పక్కకు పెట్టి కొత్త ఒరవడిగా స్త్రీ లింగంగా చెప్పిన ఆధునిక ప్రయోగం. చంద్రుణ్ణి చంద్ర బింబం అనే పేరు గల భార్యగా, రాహువును భర్తగా, నక్షత్రాలు వారి పిల్లలుగా, భూమి నుంచి వెళ్లిన ఆర్యభట్టును చుట్టముగా పెట్టి సంసారంలో మహిళగా చంద్రబింబం పడుతున్న క్షోభను చిత్రీకరించినది. భార్య చంద్రబింబం భర్తయిన రాహువు కర్కశత్వాన్ని, హింసకు గురవుతున్న పరిస్థితిని, దేవతా లోకంలో దేవుళ్ళు దేవతలను ఎట్లా పీడిస్తుంటారు అని ఆర్యభట్టుతో పంచుకున్నట్లు మహిళావాద కోణాలు ఏకరువుగా వర్ణన చేసింది. ఈ పద్యకావ్యంలో మహిళా సమస్యల్ని, ప్రాచీన కథాంశాలను, ఆధునిక మానవ సాంకేతికతను, ఇతివృత్తాలుగా చేసి కొత్త ప్రయోగశీలిగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయారు.

మహిళల, దళితుల జీవితాల్లోని సామెతలు విరివిగా వాడి, ఒక నవలల్లో లాగా అనేక పాత్రల సమ్మిళితంగా ఈ పద్యకావ్యాన్ని రూపొందించడం గొప్ప విషయం. స్వరూపరాణి ప్రతి రచన ల్లో జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేడ్కర్, జాషువా, పెరియార్ కుల నిర్మూలన, హేతువాద దృష్టి, సమానత్వ చైతన్యాల స్పూర్తులు ప్రతిఫలించే భావాలు,స్వేచ్ఛ, సమానత్వం స్వరూపరాణి గారి రచనల్లో విరివిగా కనబడుతుంటవి. అంటరాని కులాల మహిళా ప్రగతిని కాంక్షిస్తూ, వారిపై కొనసాగే అణచివేతను నిలదీసే తిరుగుబాటు కలంగా సాగిన ఆమె రచనలు ఈ సమాజానికి గొప్ప మేల్కొలుపు.అణచివేతలను నిలదీసే తిరుగుబాటుగా రూపొందిన ఆమె రచనలు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇంతటి మహాకవయిత్రికి, భాషా పండితురాలికి, సాహితీ ప్రతిభాశాలికి రావాల్సినంత గుర్తింపులు, గౌరవాలు రాకపోవడం సాహితీ లోకానికి పట్టిన సామాజిక గ్రహణం.

జూపాక సుభద్ర
9849905687

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News