బ్రెసిలియా: దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో 41 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ తో మరణించాడని అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. ఆఫ్రికాలో కాకుండా బయటి దేశంలో మంకీపాక్స్ తో మరణించిన ఘటన ఇదే తొలిది. బ్రెజిల్ రాష్ట్రం మినాస్ గెరాయిస్ రాజధాని బెలో హోరిజోంటేలో సదరు వ్యక్తి మంకీపాక్స్‌తో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే అతనిలో రోగనిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ) అత్యంత బలహీనంగా ఉందని, రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికి వెయ్యి దాకా మంకీపాక్స్ కేసులు బ్రెజిల్‌లో నమోదు అయ్యాయి. సావో పాలో, రియో డీ జనెరియోలోనే ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. జ్వరం, హై ఫీవర్, వాపు లక్షణాలు, చికెన్‌పాక్స్ తరహా ఒంటిపై దద్దర్లు తదితర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు. గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా మంకీపాక్స్ ఒకరి నుంచి ఒకరిని వ్యాపిస్తోంది. చికిత్సతో వైరస్ నుంచి బయటపడొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే సెక్స్ పార్ట్‌నర్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు సైతం జారీ చేసింది.