మరింత కఠిన నిబంధనల అమలుకు సన్నాహాలు
ఈనెలాఖరులోగా బూస్టర్‌డోసుల పంపిణీకి గడువు మార్పు
లండన్ : బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసుల్లో తొలి మరణం నమోదైంది. ఈ వేరియంట్ సోకిన వారిలో ఒకరు మృతి చెందారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం ధ్రువీకరించారు. ఈమేరకు ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదివరకు బూస్టర్ డోసు పంపిణీకి విదించిన గడువును ఇప్పుడు ముందుకు తీసుకొచ్చారు. ఇదివరకు 2022 జనవరి నెలాఖరు లోగా 18 ఏళ్లు పైబడినవారందరికీ బూస్టర్ డోసు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు ఈ గడువు ఈనెలాఖరుకు మార్చారు. పశ్చిమ లండన్ లోని వెల్లింగ్టన్ సమీపంలో ఓ వ్యాక్సినేషన్ క్లినిక్ ని సందర్శించిన సందర్బంగా జాన్సన్ మాట్లాడుతూ ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, తేలిక పాటి లక్షణాలున్న ఒమిక్రాన్‌ను తక్కువ అంచనా వేసి ఉదాసీనతతో ఉండవద్దని ఆయన ప్రజలకు హెచ్చరించారు. ఇది ప్రజల్లోకి వ్యాపించడానికి ముందే అందరికీ బూస్టర్ అందించడమే క్షేమదాయకమని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి అత్యవసరంగా టివిలో ప్రసంగిస్తూ ఒమిక్రాన్ అలలా విరుచుకుపడి ప్రజల్లో వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరించారు. బ్రిటన్‌లో నవంబరు 27 న ఒమిక్రాన్ మొదటి కేసు బయటపడింది. దాంతో అనేక కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. బూస్టర్ డోసు వల్లనే ఒమిక్రాన్ నుంచి రక్షణ కలుగుతుందని ఆయన చెప్పడంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున జనం బారులు తీరి ఉన్నారు. ఒమిక్రాన్ అసాధారణ స్థాయిలో వ్యాపిస్తోందని, ప్రతి రెండు మూడు రోజులకు ఒమిక్రాన్ కేసులు రెట్టింపు అవుతున్నాయని మళ్లీ మనం వ్యాక్సిన్‌కు, వైరస్‌కు మధ్య పరుగుపందెంలో ఉన్నామని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి సజీద్ జెవిడ్ సోమవారం ప్రజలను హెచ్చరించారు. ఒమిక్రాన్‌తో ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ బి ప్లాన్ ఆదేశాల మేరకు ప్రజలు ఇంటివద్ద నుంచే పనిచేయవలసి ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం నిబంధనలు కఠినంగా అమలు లోకి వస్తాయి. ఇళ్లల్లో కూడా మాస్కులు ధరించడం, ఏదైనా కార్యక్రమాలకు హాజరు కావాలంటే కొవిడ్ వ్యాక్సినేషన్ పాస్ తప్పనిసరి. ఇవన్నీ బుధవారం నుంచి అమలు లోకి వస్తాయి.