రక్షణ నియామకాల్లో అగ్నిపథ్:
త్రివిధ దళాల్లో సంస్కరణల్లో భాగంగా అగ్నిపథ్ పేరుతో స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. వేతనాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడం, సైన్యంలో మరింతగా యువ రక్తాన్ని నింపడం లక్షంగా తెచ్చిన ఈ పథకానికి ప్రధాని నేతృత్వంలో జరిగిన రక్షణపై కేబినెట్ కమిటీ భేటీ ఆమోదముద్ర వేసింది. దేశభక్తి, స్పూర్తి కలిగిన యువతను జాతి సేవకు వీలు కల్పించే అద్భత పథకంగా దీనిని అభివర్ణించారు. తద్వారా దేశ రక్షణ మరింత బలోపేతమవుతుందన్నారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం అత్యంత క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యాలున్న యువత సమాజంలోకి తిరిగొచ్చింది.
అగ్నిపథ్ స్వరూపం:
ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ
త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు.
ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి.
త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. వయో పరిమితి 17.7 21ఏళ్లు, ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి.
సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ఆలిండియా ఆల్ క్లాస్ విధానంలో రిక్రూట్ మెంట్ ఉంటుంది. దీంతో రాజ్‌పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి.
విధుల్లో చేరే వారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకులు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు.
వేతనం తొలి ఏడాది నెలకు రూ. ౩౦,౦౦౦ ఉంటుంది. అయితే రూ. 21వేలు చేతికిస్తారు. 9వేల రూపాయలు కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రం అంత మొత్తాన్ని జమ చేస్తుంది. నాలుగో ఏడాది 40వేల రూపాయలు వేతనంగా అందుతుంది.
అభ్యర్థులకు నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ. 11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనికి ఎటువంటి సేవా పన్ను ఉండదు.
సర్వీసు కాల వ్యవధికి రూ. 48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజి ఉంటుంది. గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఉండవు.
వారి ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు.
మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
భారత్‌కు చమురు సరఫరాలో రెండో స్థానంలో రష్యా:
భారత్‌కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో స్థానానికి చేరింది. మే నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. మొత్తం చమురు దిగుమతుల్లో ఇది 16 శాతంపైగా ఉంటుంది. సముద్ర మార్గంలో భారత్ చేరుకునే మొత్తం దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చే ఉత్పత్తుల వాటా ఏప్రిల్ లో తొలిసారిగా 5 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాక్ అగ్రస్థానంలో ఉంది.
హనుమాన్ చౌదరికి జీవిత సాఫల్య పురస్కారం:
బముముఖ ప్రజ్ఞావంతుడు, ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. 49వ వార్షికోత్సవాల్లో భాగంగా ది హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 2021 22 ఏడాదికిగాను ఆయనకు ఈ పరుస్కారాన్ని అందజేసింది.
పది రెట్ల వేగంతో త్వరలో 5జీ సేవలు:
5జీ టెలికం సేవల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో -ఊరిస్తున్న 5జీ సేవలు 4జీ కంటే దాదాపు 10 రెట్లు వేగంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్ వేలానికి క్యాబినెట్ తుది ఆమోదం తెలిపింది.
పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు:
కోయంబత్తూరు షిర్డీ మధ్య నెలలో రెండు మూడు సార్లు ఈ ప్రైవేటు రైలు నడుస్తోంది. మార్గమధ్యంలో తిరుప్పుర్, ఎరోడ్ , సేలం, యెలంక, ధర్మవరం, మంత్రాలయం రాదారి, వాడి స్టేషన్లలో ఆగుతూ మహారాష్ట్రలోని షిర్డీ వరకూ వెళ్లుతుంది. ఈ ప్రైవేటు రైలును భారత్ గౌరవ్ పథకంలో భాగంగా ఆరంభించారు. ప్రయాణికులకు పలు సౌకర్యాలు, ఆతిధ్య మర్యాదలతో ప్రైవేటు రైళ్లను పలు మార్గాలలో ప్రవేశపెట్టడానికి భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసుకుంది. ఈ రైలును రెండేళ్ల కాలానికి నిర్వాహకులకు రైల్వే విభాగం లీజుకు ఇచ్చిందని దక్షణ రైల్వే ప్రధాన పౌర సమాచార సంబంధాధికారి బి గుగనేశన్ ఈ రైలుకు పచ్చజెండా నేపథ్యంలో తెలిపారు. దేఖో అప్నాదేశ్ ( నీ దేశాన్ని చూడు) ఇతివృత్తంతో ఈ ప్రైవేటు రైలు ఇప్పుడు పట్టాలెక్కడం భారతీయ రైల్వే చరిత్రలో కొత్త మలుపు అయింది.
1100 మంది ప్రయాణికులతో పరుగులు:
ప్రైవేటు రైలులో వెళ్లగలిగే స్తోమత ఉన్న 1100 మంది ప్రయాణికులతో ఈ రైలు తొలి ప్రయాణం ఆరంభం అయింది. స్టేషన్‌కు వచ్చిన ఈ రైలు ప్రయాణికులకు తొలుత అక్కడ నిలిచిన భారతీయ వేషధారణతో కూడిన మహిళలు చేతులు జోడించి నమస్కారం చెపుతూ పూలు అందిస్తూ ఘనమైన స్వాగతం పలకడం ఆనవాయితీగా నిలుస్తోంది.