అంతర్యుద్ధంతో సంక్షోభం తలెత్తిన సిరియాలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. అంతర్జాతీయ విమానసర్వీసులు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. తిరుగుబాటుదారుల దాడులతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయిన తరువాత ఖైదా అనుబంధ సంస్థ హయాత్ తహరీర్ అల్ షమ్ సిరియాను అధీనం లోకి తెచ్చుకుంది. ఈ క్రమంలో దేశం లోని అన్ని విమానాశ్రయాలు మూసివేశారు. తరువాత కొన్ని రోజులకు దేశీయ విమానాలకు మాత్రమే అనుమతించారు.
ఇప్పుడు మంగళవారం తొలిసారి ఓ అంతర్జాతీయ విమానం సిరియాలో ల్యాండ్ అయింది. ఖతార్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఖతార్ నుంచి ఓ విమానం సిరియాకు వెళ్లడం గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి. మరోవైపు సిరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 145 మంది ప్రయాణికులతో డమాస్కస్ నుంచి యూఏఈ రాజధాని షార్జాకు పయనమైంది. వారానికి మూడు రోజుల వంతున సిరియాకు విమానాలు నడపనున్నట్టు ఇటీవల ఖతార్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.