మన తెలంగాణ/హైదరాబాద్: భారత కాలమాన ప్రకారం ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం భారతదేశములో కనిపించకపోయినా గ్రహణ స్నాన, దైవ మంత్ర జప, హోమ అనుష్ఠానం వంటి నియమాలు పాటించాల్సిందిగా ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అనంతమైన ఈ విశ్వంలో సూర్య, చంద్రులు ఒకరే వుంటారు తప్ప, ఏ దేశానికి ఆ దేశం సూర్యచంద్రులు వుండరని., కాబట్టి దక్షిణ అమెరికా, అంటార్కికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతం, చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనా, బొలీవియా, పెరూ, బ్రెజిల్ దేశాలకు సూర్యగ్రహణం సంభవిస్తున్నా, గ్రహణ శక్తిని విశ్వసించేవారూ, నియమ నిబంధనలు పాటించే అవకాశం ఉన్నవారు మాత్రమే గ్రహణాన్ని పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు తెలిపారు. ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30 శనివారం మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు మే 1 ఆదివారం తెల్లవారుఝామున 04:07 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుందని, అయితే మేషం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు పేర్కొన్నారు.
భారతదేశం మీద గ్రహణ ఛాయ పడదు
దీనికి ప్రతివాదనగా హైదరాబాద్ ఫిలిం నగర్ దేవస్థానంలో ఆధ్యాత్మిక నిపుణులు తొలి సూర్యహణం గురించి స్పందించారు. మన పంచాంగం ప్రకారం ఏప్రిల్ 30 శనివారం సంభవించే సూర్య గ్రహణ ఛాయలు భారతదేశపు భూమి మీద పడటం లేదు కాబట్టి, అది మన దేశస్థులకు అశౌచం కాదని పేర్కొన్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఎవరూ కూడా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని., మేషం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్రహణ సమయంలో దేవతా మంత్ర జపం చేస్తే ఆ మంత్ర శక్తి పట్టు అత్యధికంగా ఉండి మానవ మేధస్సుపై పని చేస్తుందని, కానీ మన దేశం పై గ్రహణ చాయ పడకపోవడంతో దేవతా మూర్తుల ఆలయాలు మూయరని, మంత్ర జప ప్రభావం సాధారణంగానే ఉంటుందని తెలియజేశారు.