Saturday, December 21, 2024

ముందు పోలవరం ముంపు సమస్యను తేల్చండి

- Advertisement -
- Advertisement -

కేంద్రంపై వత్తిడి పెంచుతున్న తెలంగాణ
20న ఢిల్లీలో పోలవరంపై కీలక సమావేశం
పనులు, నిధుల కార్యాచరణ ఖరారు !

మనతెలంగాణ/హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల తెలంగాణ రాష్ట్ర పరిధిలో జరిగే వరదనీటి ముంపు సమస్యను తేల్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచుతోంది. ముందు తమ భూబాగంలో జరిగే ముంపు సమస్య తేల్చాకే ప్రాజెక్టు పనులపై ముందు కెళ్లాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విజ్ణప్తి చేస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరోమారు ఈ అంశాన్ని ఘాటుగానే కేంద్రం దృష్టికి మరో మారు తీసుకుపోవాల నిర్ణయించింది.

ఈ నెల 20న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టుపై కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్ సింగ్ వోరాతోపాటు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం కూడా పాల్గొనే ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించనున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక , పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవరించిన బడ్జెట్ అంచనాల ఖరారు, తదితర అంశాలే అజెండాగా జరగనున్న ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఈవో ప్రాజెక్టు పనులతీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వర్షాకాలం ముగిసిపోవటం , గోదావరినదిలో నీటి ప్రవాహం తగ్గటం , వేసవి సమీపిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పెంచనున్నారు. ఎగువ ,దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనులు , దెబ్బదితన్న డయాఫ్రం వాల్ పరిశీలన, ఇపుడున్నదాన్ని అలాగే ఉంచాలా లేక దాని స్థానంలో కొత్తది నిర్మించాలా అన్నదానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనున్నారు.

పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపు సమస్య కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర భూబాగంలో గోదావరి నదికి ఇరువైపులా పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. గత రెండు వర్షాకాలాల్లో గోదావరి వరదనీటి ప్రవాహాలను పరిశీలిస్తే భద్రాచలం వద్ద గోదావరి నదిలో బ్యాక్ వాటర్ నదికి ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. అంతే కాకుండా గోదావరి నదిలో కలిసే పలు వాగులు కూడా గోదావరినదిలో బ్యాక్ వాటర్‌కు ప్రభావితమయ్యాయి . ఈ వాగుల్లో వరదనీరు గోదావరి నదిలో కలియకుండా బ్యాక్‌వాటర్ పోటేయటంతో పంట పొలాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఈ సమస్యలన్నింటిని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు కేంద్రం దృష్టికి తీసుకుపోయింది. నీటిపారుదల రంగానికి చెందిన నిపుణులతో ఉమ్మడి సర్వే నిర్వహించాలని కోరుతూ వస్తోంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకొని గోదావరి నదికి ఇరువైపులా ముంపు సమస్యను గుర్తించాలని , ఆ మేరకు ముంపు సమస్యకు శాశ్విత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కొరుతూ వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిపై పోలవరం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అయ్యే వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది.ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఎగువ ప్రాంతాల్లో ఏర్పడే ముంపు సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సబంధించి సవరించిన అంచనా వ్యయం రూ. 31,625కోట్లకు చేరుకుంది. అందులో ఇప్పటివరకూ రూ.16119కోట్ల విలువ మేరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులకు రూ.15505 కోట్లు అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం నివేదిక సిద్దం చేసింది. ఈ నివేదికను పరిశీలన చేసేందకు కేంద్ర ఆర్దికశాఖ రివైజ్డ్ కాస్ట్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అభిప్రాయాలపై కూడా ఈ నెల 20న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్వి శశిభూషణ్ కుమార్ , ఈఎన్సీ నారాయణరెడ్డి , ప్రాజెక్టు సిఈ ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులపై నివేదికలు రూపొందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పోలవరం బ్యాక్ వాటర్ ముంపు సమస్య పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News