Sunday, November 17, 2024

పొట్టి సిరీస్‌కు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

రాంచీ: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ తాజాగా టి20లోనే అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే వన్డేల్లో ఓడిన పర్యాటక న్యూజిలాండ్ కనీసం టి20 సిరీస్‌నైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక ఆతిథ్య భారత్ ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్, షమి, సిరాజ్, జడేజా తదితరులు లేకుండానే కివీస్‌తో తలపడనుంది. అయితే పృథ్వీషా చేరడంతో భారత్ బ్యాటింగ్ బలంగా మారింది. కొంతకాలంగా పృథ్వీషా దేశవాళీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న సంగతి తెలసిందే. ఇక కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఉండనే ఉన్నాడు. వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, మరో సెంచరీతో అలరించిన గిల్ టి20ల్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు.

కొంతకాలంగా టి20 ఫార్మాట్‌లో ఎదురులేని బ్యాటర్‌గా పేరుతెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ రూపంలో భారత్‌కు పదునైనా అస్త్రం ఉండనే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. సీనియర్లు దూరంగా నేపథ్యంలో సూర్య పాత్ర మరింత కీలకంగా మారింది. అంతేగాక సిరీస్‌లో అతను హార్దిక్ పాండ్యకు డిప్యూటీగా కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతను మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇషాన్ కిషన్, పృథ్వీషా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడాలతో భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక హార్దిక్ రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. శివమ్ మావీ, కుల్దీప్, ఉమ్రాన్, అర్ష్‌దీప్, చాహల్, సుందర్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్‌ను ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకోవడం కివీస్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియాకే సిరీస్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ప్రతీకారం కోసం..

మరోవైపు వన్డే సిరీస్‌లో బాగానే ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేక పోయిన న్యూజిలాండ్ టి20ల్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. మిఛెల్ సాంట్నర్ నేతృత్వంలోని కివీస్ టీమ్‌లో ప్రతిభావంతులైన ఆటగాళలకు కొదవలేదు. వన్డే సిరీస్‌లో సాంట్నర్‌తో పాటు మైఖేల్ బ్రాస్‌వెల్, ఓపెనర్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ తదితరులు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ బలంగానే కనిపిస్తోంది. అయితే సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. టి20 సిరీస్‌లో ఓటమికి ఇదే ప్రధాన కారణంగా చెప్పాలి. కానీ సాంట్నర్ సారథ్యంలోని కివీస్‌ను తక్కువ అంచనా వేస్తే టీమిండియా భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. దీంతో కివీస్ కూడా సిరీస్‌లో విజయమే లక్షంగా పెట్టుకుంది. రెండు జట్లు కూడా సిరీస్‌పై కన్నేయడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News