Saturday, January 11, 2025

ఉపరాష్ట్రపతిపై ఇదే ‘మొదటి’ అవిశ్వాసం

- Advertisement -
- Advertisement -

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభలో అత్యంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతిపై ఈ విధంగా అవిశ్వాసాన్ని ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ తీర్మానం నెగ్గడానికి కావలసిన బలం విపక్షాలకు లేకపోయినా, పార్లమెంట్ విలువలను కాపాడడానికి, రాజ్యాంగ పరిరక్షణ, సభ్యుల హక్కుల కోసం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఇన్‌ఛార్జి కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ఈ సందర్భంగా గమనించవలసి ఉంది. ఇది వ్యక్తులకు వ్యతిరేకంగా కాదని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటమని ఇండియా కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (బి) ప్రకారం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. అయితే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలోని సభ్యుల్లో మెజారిటీ ఆమోదించాల్సి ఉంటుంది. తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కనీసం 50 మంది సభ్యులైనా ఉండాలి.అయితే ఇండియా బ్లాక్‌కు చెందిన 60 మందికి పైగా సభ్యులు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్‌ఆద్మీ పార్టీ, డిఎంకె పార్టీలకు చెందిన ఎంపిలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు తీర్మానంపై సంతకాలు చేయలేదు. ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా తీర్మానం ప్రతిపాదించడానికి ఈ ఏడాది ఆగస్టులో కూడా ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ఈ తీర్మానం రాజ్యసభతో పాటు లోక్‌సభలో కూడా ఆమోదం పొందవలసి ఉంటుంది. ఈ మేరకు ఉభయసభల్లో మెజారిటీని సాధించడం చాలా కీలకం. సాధారణంగా ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినప్పుడు, దాని పాలనా సామర్థాన్ని సవాల్ చేయడానికి ప్రతిపక్షాలకు రాజ్యాంగం కల్పించిన హక్కే అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం దిగిపోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై అవిశ్వాసం కాదు, రాజ్యసభ ఛైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి పక్షపాత వైఖరిపైన అవిశ్వాసం. మనదేశంలో సాధారణంగా లోక్‌సభలోనే ప్రభుత్వంపై లేదా ప్రధాన మంత్రి పైన లేదా కేబినెట్ మంత్రుల పైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం చూస్తుంటాం. అవిశ్వాస తీర్మానానికి సభ్యులు మద్దతు ఇచ్చిన తరువాత స్పీకర్ సెలవు మంజూరు చేయవచ్చు. లోక్‌సభలోని నిబంధనలు ప్రకారం 16వ ఎడిషన్‌లోని రూల్ 198 లోని సబ్‌రూల్ (2). (3) కింద తీర్మానంపై చర్చ కోసం ఒకటి రెండు రోజులు కేటాయిస్తుంటారు. ఆ తరువాత దీనిపై ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా మెజారిటీ సభ్యులు ఓటు వేస్తే అది ఆమోదం పొందుతుంది. మనదేశంలో ఈ అవిశ్వాస తీర్మానాలు ఎక్కువగా ప్రధాన మంత్రులపైనే జరిగాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్‌సభలో 27 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ నెగ్గలేదు. అయితే 1979 జులైలో మొరార్జీదేశాయ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, దానిపై ఓటింగ్ జరగకముందే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాలు మాత్రం మూడు సార్లు ఓడిపోయి ప్రభుత్వాలు పడిపోయాయి. భారత ప్రధానుల్లో ఇందిరాగాంధీ ఎక్కువ అవిశ్వాస తీర్మానాలను 15 వరకు ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీపై తొలి అవిశ్వాసాన్ని 1966లో ఆమె అధికారంలోకి రాగానే కమ్యూనిస్టు నేత హీరేంద్రనాథ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. కేవలం 61 మంది ఎంపిలే మద్దతు ఇవ్వగా, 270 మంది వ్యతిరేకించారు. 1966లోనే ఆమెపై రెండో అవిశ్వాసం వచ్చింది. తరువాత 1967, 1968( రెండు సార్లు), 1969, 1970, 1973, 1974 (రెండు సార్లు ), 1975 (రెండు సార్లు రెండోసారి ఎమర్జెన్సీ విధింపునకు కేవలం నెల రోజుల ముందు) 1976, 1978, 1981 (రెండు సార్లు), 1982 లో ఇందిరపై అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. 1976లో ఇందిర ప్రభుత్వంపై బిజెపి అగ్రనేత వాజ్‌పేయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, కేవలం 162 మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. 257 మంది వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయింది. స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి చైనా భారత యుద్ధం జరిగిన తరువాత 1963లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెబి కృపలానీ లోక్‌సభలో మొట్టమొదటిసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నెహ్రూ మాదిరిగానే రాజీవ్ గాంధీ, విపి సింగ్, హెచ్‌డి దేవగౌడ, అటల్ బిహారీ వాజ్‌పేయ్, మన్మోహన్ సింగ్ ఒక్కొక్కసారి మాత్రమే అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. దేశ చరిత్రలో 2023 ఆగస్టు వరకు 31 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినట్టు రికార్డయింది. అప్పటి ప్రధానులు లాల్‌బహదూర్ శాస్త్రి, పివి నరసింహరావు మూడేసి సార్లు, మొరార్జీ దేశాయ్, నరేంద్ర మోడీ రెండేసి సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. 1999 ఏప్రిల్‌లో అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ ఒకే ఒక్క ఓటు (269270) తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవలసి వచ్చింది. విపిసింగ్, హెచ్‌డి దేవెగౌడ కూడా అవిశ్వాసం తీర్మానంలో నెగ్గుకు రాలేకపోయారు. 2018, 2023లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా బయటపడగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News