ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉండే ఆర్చ్ రైలు బ్రిడ్జిపై గురువారం రైల్వే శాఖ రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా చేపట్టింది. ఎనిమిది బోగీల మెమూ ట్రైన్‌ను ఈ చీనాబ్ బ్రిడ్జిపై ట్రయల్ రన్‌కు పంపించారు. ఈ నమూనా ప్రయాణం విజయవంతం కావడంతో ఈ అత్యున్నత రైల్వే బ్రిడ్జిపై ఇకపై రియాసీ నుంచి బారాముల్లా వరకూ రైలు మార్గం నిర్వహణకు వీలేర్పడుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ముందుగా ఈ నూతన రైలుమార్గాన్ని, బ్రిడ్జిని రైల్వేబోర్డు సీనియర్ అధికారులు, నార్తర్న్ రైల్వే, కొంకణ్ రైల్వే అధికారులు, సాంకేతిక నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తరువాత 46 కిలోమీటర్ల పొడవైన విద్యుద్ధీకరణ రైలు మార్గంపై ఈ రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పయనించిందని రైల్వే మంత్రిత్వశాఖ ఓ ప్రకటన వెలువరించింది.
రాంబన్ జిల్లాలోని సంగ్లాదాన్ నుంచి రియాసీ వరకూ ఈ రైలు ప్రయాణం సాగింది. మార్గ మధ్యంలో తొమ్మిది టన్నెల్స్ గుండా రైలు వెళ్లింది. ఇందులో టి 44 టన్నెల్ పొడవే దాదాపుగా 12 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. మొత్తం మీద దాదాపు 41 కిలోమీటర్ల వరకూ టన్నెల్స్ గుండానే రైలు సాగుతుంది. సంగ్లాదాన్ నుంచి మధ్యాహ్నం 12.35 నిమిషాలకు బయలుదేరిన రైలు రియాసికి రెండుగంటల ఐదు నిమిషాలకు చేరింది. కశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించే క్రమంలో భాగంగా అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ ప్రతిభతో, సాంకేతిక పరిజ్ఞానం వినిమయంతో ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జి రూపొందడం ఓ ఎత్తయితే, దీనిపై ఇకపై రైళ్లు పరుగులు తీయడం మరో కీలక మలుపు అవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమంలో వెల్లడించారు.