ఆ తర్వాత సిఎం ఎవరో అధిష్టానం నిర్ణయిస్తుంది
సిఎం అభ్యర్థులకు చురకలంటించిన విహెచ్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిఎం ఎవరన్న దానిపై రోజుకో పేరు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరికీ వారే సిఎం సీటుపై ఆశలు పెట్టుకుటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా సిఎం పదవికి అర్హులం తామేనంటూ వారు తమ మనసులో మాట బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి విహెచ్ అలాంటి వారిని ఉద్ధేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డిలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఎవరికీ వారే నేనే సిఎం అంటున్నారు, నేనే సిఎం అనడం ముందుగా కాంగ్రెస్ లీడర్లు మానేయ్యాలని ఆయన సూచించారు. ఈ సిఎం గోల ఆపమని మాణిక్‌రావు ఠాక్రే నేతలందరికీ చెప్పాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిఎం ఎవరూ అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని విహెచ్ స్పష్టం చేశారు. తనకు కూడా గతంలో సిఎం అయ్యే అవకాశం వచ్చి పోయిందని ఆయన గుర్తు చేశారు. ముందు ఎన్నికల్లో గెలవండి ఆ తర్వాత సిఎం పంచాయతీ తేలుతుందని నేతలకు ఆయన చురకలంటించారు.