Thursday, January 23, 2025

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో తొలిసారిగా మహిళలను లైన్ ఉమెన్‌గా తీసుకున్నాం

- Advertisement -
- Advertisement -

దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత లేదు
రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి

First women linemen in TSSPDCL

 

మనతెలంగాణ/హైదరాబాద్:  టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో తొలిసారిగా మహిళలను లైన్ ఉమెన్‌గా తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. టిఎస్‌ఎస్‌పిడి సిఎల్‌లో తొలిసారిగా లైన్‌ఉమెన్‌గా ఉద్యోగం పొందిన శిరిషకు నియామక పత్రాన్ని బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి జగదీశ్ రెడ్డి అందించి ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు బబ్బూరి శిరీషకు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సంస్థ వేసిన ఉద్యోగుల నోటిఫికేషన్‌లో భాగంగా లైన్‌ఉమెన్‌గా దరఖాస్తు చేసుకుందని, పరీక్షలో పాసై ప్రస్తుతం ఆ ఉద్యోగాన్ని సాధించిందన్నారు. చరిత్రలో ఇవాళ ఉద్యోగం పొందిన మహిళగా శిరీష నిలుస్తోందని మంత్రి తెలిపారు. చరిత్రలో మహిళలకు అవకాశం లేదనీ, కానీ, గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం మేరకు 200పై చిలుకు లైన్ ఉమెన్‌లను ట్రాన్స్‌కో సంస్థ ఉద్యోగంలోకి తీసుకుందని మంత్రి తెలిపారు. దేశ చరిత్రలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం ఇచ్చిన సంస్థగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ నిలుస్తుందన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఉద్యోగం పొందిన మహిళలను లైన్ ఉమెన్ లేదా లైన్‌మెన్ అనేకంటే పవర్ లైన్ ఆపరేటర్ లేదా లైన్ ఆపరేటర్ అని పిలిచేలా సవరణలు చేస్తామని గతంలో మంత్రి కెటిఆర్ హామినిచ్చారని త్వరలో ఈ సవరణ జరిగే అవకాశం ఉందని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది

రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడునా అడ్డుకుంటుందన్నారు. కరెంట్ కొనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. అయినా ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమావాస్య రోజు హెలికాప్టర్ వేసుకొని వస్తే దేశంలో ఎక్కడ వెలుగులు కనిపిస్తే అదే తెలంగాణ రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. బొగ్గు కొరత రాష్ట్రంలో లేదనీ, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బిఎంకు లోబడి అప్పులు తీసుకోవాలని కేంద్రం అనేక ఇబ్బందులు పెడుతుందన్నారు. అభివృద్ధిలో ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఎలా ముందుకు తీసుకుపోవాలో సిఎం కెసిఆర్‌కు తెలుసునని ఆయన తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చు: శిరీష లైన్‌ఉమెన్

ఒక మహిళగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సంస్థలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందని శిరీష లైన్‌ఉమెన్,టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చని ఆమె సూచించారు. తాను కష్టపడి పని చేసి సంస్థకు మంచి పేరు తీసుకువస్తానని ఆమె తెలిపారు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించిన సంస్థకు, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రికి, సిఎండి రఘుమా రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిరీష స్వస్థలం సిద్దిపేట్ జిల్లా కాగా, మేడ్చల్ జిల్లాలో ఆమె విద్యాభ్యాసాన్ని కొనసాగించడంతో ఆమెకు మేడ్చల్ సర్కిల్‌లో పోస్టింగ్‌ను ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News