Sunday, November 24, 2024

వివాదాల సుడిలో చేపల వేట

- Advertisement -
- Advertisement -

భారీ పర్స్ వలతో రెండు పెద్ద బోట్లు కలిసి చేపలను వేటాడే ప్రక్రియపై అనేక రాష్ట్రాలు నిషేధం విధించడంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యా లు దాఖలవుతున్నా యి. ఈ విధంగా నిషేధం విధించడం న్యాయ సమ్మతమా కాదా అన్నది విచారణ దశలో ఉంది. చిన్న, పరిమిత, భారీ మత్స కార్మికుల మధ్య దీనిపై వివాదాలు ముసురుకున్నాయి. పర్స్‌వలతో చేపలను వేటాడడం అంటే రెండు పెద్ద బోట్లు ఒక తోలుసంచి వంటి భారీ నిలువు వలతో ఒకేసారి గుత్తగోలుగా చేపలను పట్టడం. పర్స్‌వల అంచునున్న తాళ్లను బిగించి చేపలను పడుతుంటారు. ఈ విధంగా పర్స్‌వలతో చేపలను వేటాడడం భారతదేశ పశ్చిమ కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాచుర్యం పొందిం ది. ఈ ప్రక్రియలో అంత లోతులేని నీళ్లలో చిన్నగా మెరిసే చేపలను వేటాడుతుంటారు.

ఇలాంటి వేటపై కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనలకు దారి తీస్తోంది. తేలికపాటి నీళ్లలో చిన్న చేపలు తరిగిపోతున్నాయని, పోషకాహార విలువలున్న కవ్వలు, వంజరం వంటి చేపలు కూడా ఈ పర్స్‌వలకు బలి అవుతున్నాయని ఆందోళన వ్యక్తమౌతోంది. వంజరంలోని సీర్ చేప చాలా ఖరీదైనది. తమిళనాడు తీరంలో ఎక్కువగా దొరుకుతుంది. దీన్ని సురమాయి అని మహారాష్ట్రలో పిలుస్తారు. భారత్‌తో పాటు దక్షిణాసియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, దేశాల్లోనూ ఇది విరివిగా లభిస్తాయి. వీటి కిలో రూ. 500 నుంచి రూ. 2000 వరకు పలుకుతోంది. వీటి నుంచి వైద్యపరంగా ఒమెగా 3 చమురు లభిస్తుంది. మెదడు, నాడీ మండలం అభివృద్ధి చెందడానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడానికి, క్యాన్సర్, కీళ్ల నొప్పులు తగ్గడానికి ఒమెగా 3 చమురును ఔషధాల్లో వినియోగిస్తారని చెబుతున్నారు.

చమురుతో కూడిన కవ్వల చేపలంటే కేరళ ప్రాంతీయులకు చాలా మక్కువ. ఇప్పుడు ఈ పర్స్ వేటతో ఈ చేపలు దొరకడమే కష్టమౌతోందని కేరళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేరళలో 2012లో 3.9 లక్షల టన్నుల చేప లు లభించగా, 2021 నాటికి వీటి లభ్యత బాగా క్షీణించి కేవలం 3297 కవ్వలే లభించాయి. అయితే ఈ పర్సువేటపై ఆధారపడే కొన్ని వర్గాలు ఇది కేవలం చిన్న చేపలను మాత్రమే వేటాడడానికి ఉపయోగిస్తారని మిగతా పెద్ద చేపల జోలికి వెళ్లరని వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాలను పరిశీలించడానికి కమిటీని నియమించింది.

ఆ కమి టీ నివేదిక ఇంకా వెలుగులోకి రాలేదు. ఏదేమైనా ఈ పర్సువేటను క్రమబద్ధీకరణ చేస్తేనే సంప్రదాయ మత్స కార్మికుల మనుగడ సాగుతుందని, సీజన్ బట్టి ఎన్ని బోట్లను వేటకు ఎప్పుడు పంపాలో నిర్ణయించి అజమాయిషీ చేసే వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. కేరళ తీరంలో 2014 నుంచి 2021 మధ్య కాలంలో చేపలు తగ్గిపోడానికి ప్రకృతి వైపరీత్యాలే తప్ప పర్స్‌వేట కాదని మళ్లీ వీటి నిలలు 2022లో పుంజుకున్నాయని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సిఎంఎఫ్‌ఆర్‌ఐ) మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సునీల్ మొహమ్మద్ పేర్కొన్నారు. పర్స్‌వేట సాగించే బడా బోట్లపై ఆధారపడిన కార్మిక సంఘా లు ప్రభుత్వం నివేదిక విడుదల చేస్తేనే కానీ ఈ సమస్యలు తీరవని అంటున్నారు. ఆ నివేదిక బట్టి తమ భవిష్యత్ ప్రణాళిక ఉంటుందని, వీలైతే నిషేధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఛార్లెస్ జార్జి వెల్లడించారు.

ట్రేడ్ యూనియన్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర నివేదిక అందుబాటులోకి వస్తే సంప్రదాయ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏదేమైనా నిషేధం ఎత్తివేయడానికే తమ సంస్థ మద్దతు ఇస్తుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషరీస్ వర్కింగ్ ఛైర్మన్ ఎస్. ప్రభాకరన్ స్పష్టం చేశారు. నేరుగా నిషేధించడం కన్నా కొన్ని నిబంధనలు ప్రభుత్వం అమలులోకి తెస్తే బాగుంటుందని సూచించారు. ఎవరైతే మెకనైజ్డ్ బోట్లు ఉపయోగించరో, చిన్న బోట్లను ఉపయోగిస్తారో సముద్ర జలాల్లో 5 నాటికల్ మైళ్ల పరిధిలోనే వారికి ప్రవేశం కల్పించాలన్నారు. నడి సముద్రంలో పర్సువలతో వేటకే అవకాశం ఇవ్వాలని సూచించారు. అంతర్జాతీయంగా ఈ విధానం అనుసరిస్తున్నారని చెప్పారు.

ఏదేమైనా దీనిపై చర్చ జరగాలన్నారు. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు పర్స్‌వేటకు అంగీకరించడం లేదు. సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధమౌతున్నాయి. పర్సువల వేటను తమ రాష్ట్రం పూర్తిగా వ్యతిరేకిస్తోందని కేరళ మత్సశాఖ మంత్రి వి. అబ్దుల్ రెహ్మాన్ నిర్మొహమాటంగా చెప్పారు. పర్సువల వేట ఒక పద్ధతి లేని విధానమని, వలలోకి గుత్తగోలుగా ఒకేసారి వచ్చిన చేపలన్నిటినీ లాగేస్తారని,సముద్ర సంపదకు ఇది తీరని నష్టం కలిగిస్తుందన్నారు. చేపల వేట అన్నది రాష్ట్రానికి సంబంధించిన అంశమని చెప్పా రు. తమిళనాడు రాష్ట్ర ఫిషరీస్ కమిషనర్ కెఎస్ పళనిస్వామి దీనిపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుందన్నారు. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఒడిశా, దాద్రా, నాగర్‌హవేళీ, డామన్ డియు, ప్రాదేశిక జలాల్లో పర్స్‌వేటను నిషేధించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 12 నాటికల్ మైళ్ల పరిధి వరకు నిషేధం ఉంటోంది. అయితే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎలాంటి నిషేధం విధించలేదు. మహారాష్ట్ర క్రమబద్ధీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసింది తప్ప పర్సువల వేటపై నిషేధం విధించలేదు.

కేరళలో విఝింజామ్ పోర్టు వద్ద దేశంలోనే మొట్టమొదటి మెగా ట్రాన్‌షిప్‌మెంట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్టును 900 మిలియన్ డాలర్ల వ్యయంతో వాణిజ్య దిగ్గజం అదానీ చేపట్టారు. అయితే 2015 డిసెంబర్ నుంచి పోర్టు నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి తీర ప్రాంతం కోతకు గురవుతోందని, భవనాలు ధ్వంసం అవుతున్నాయని 56,000 మంది మత్సకారులు ఆందోళన సాగించారు. 140 రోజుల పాటు ఈ ఆందోళన సాగినప్పటికీ కొన్ని అవాస్తవ డిమాండ్లు చోటు చేసుకోవడం, కోస్తా బెల్టు తాలూకు అన్ని సమస్యలను ఈ పోర్టు నిర్మాణంతో ముడిపెట్టడం, చివరికి హింసాత్మకంగా మారి పోలీస్‌స్టేషన్‌పై దాడి, ఆస్తుల విధ్వంసానికి దారి తీయడంతో ఆందోళన పక్కదారి పట్టి చివరకు ఏ డిమాండ్లు నెరవేరకుండానే ముగిసిపోయింది. పోరాటం ప్రస్తుతం భగ్నమైనప్పటికీ కోస్తా మత్సకార సమాజం లేవనెత్తిన సమస్యలు విస్మరించడానికి వీలులేనివి. తీరం కోతకు గురై ఆస్తులను పోగొట్టుకున్న వందలాది కుటుంబాలకు పునరావాసం కల్పించవలసిందే.

మాంసాహారం తీసుకునే ప్రపంచ తలసరి సగటు జనాభాలో దాదాపు 17 శాతం మందికి చేపల ఉత్పత్తులు ఆధారంగా ఉంటున్నాయి. అందుకనే చాలా మందికి చేపల వేట నిత్యజీవనాధారంగా నిలుస్తోంది. ఆహార భద్రతకు చెప్పుకోదగిన ఊతం అందిస్తోంది. అయితే జీవశాస్త్రపరంగా చేపల నిలలు నిలకడలేని స్థాయిల్లో ఉంటున్నాయి. చేపల నిల్వలు క్షీణిస్తుండటంతో ఆర్థికపరంగా 83 బిలియన్ డాలర్లవరకు ఆర్థికంగా నష్టం వస్తున్నట్టు ఒక అంచనా. చేపల వేటను నియంత్రించడం ద్వారా ఈ నష్టాల లోటును భర్తీ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ మత్స సంపద వేటపై ఆధారపడే ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రమాదకరమైన ఫిషింగ్ సబ్సిడీలను ప్రోత్సహించడం కొనసాగిస్తు న్నాయి. ఈ సబ్సిడీల ఫలితంగా చేపల వేటకు అడ్డూఆపూ ఉండటం లేదు.

2018లో ప్రపంచం మొత్తం మీద 22 బిలియన్ డాలర్ల వరకు సబ్సిడీలు చేపల వేటలకు అందాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ) ఒప్పందం ప్రకారం 1995 నుంచి సబ్సిడీల కేటాయింపు, వ్యతిరేకించే ప్రమాణాల పై ప్రపంచ వాణిజ్య సంస్థ అజమాయిషీ చేయడం ప్రారంభమైంది. అయితే ఈమేరకు రూపొందించిన నిబంధనలు వాణిజ్యం వక్రదారి పట్టకుండా చూడడం పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి తప్ప పర్యావరణ దుష్పలితాలపై పట్టించుకోవడం లేదు. అందువల్ల 2001 నుంచి ఫిషరీస్ సబ్సిడీల కొత్త నిబంధనలు 2001 నుంచి ప్రపంచ వాణిజ్యస్థాయి చర్చల్లో భాగమయ్యాయి. మితిమీరిన చేపల వేటకు దోహదం చేసే సబ్సిడీలను నివారించాలన్న ఉద్దేశంతో చర్చల ప్రతిపాదనను 2005లో తిరగ రాశారు. 2011లో చర్చలు సాగలేదు.

2015 నాటి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్షాల కోసం సబ్సిడీ నివారించాలన్న ప్రతిపాదనలను సమీక్షించడమైంది. దాని ద్వారా ప్రభుత్వ ప్రతినిధులు ప్రమాదకరమైన ఫిషరీస్ సబ్సిడీలను నిషేధించడానికి కట్టుబడ్డారు. 2022 జూన్ 17న 12వ మంత్రిత్వ సదస్సులో ఫిషరీస్ సబ్సిడీలపై ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక ఒప్పందానికి వచ్చింది. మూడు రకాల ఫిషరీస్‌పై సబ్సిడీలను నిషేధించాలన్న ప్రతిపాదనలను చేర్చడమైంది. అక్రమంగా చేపలను వేటాడడం, క్రమబద్ధీకరణ కాని చేపల వేటను లేదా నమోదు కాని చేపల వేటను నిషేధించడం, మితిమీరిన చేపల నిల్వలను ఉంచుకోవడం తదితర మూడు అంశాలపై సబ్సిడీలను నిషేధించాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఆంక్షలు వర్తించడం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా యాంత్రిక నౌకలు, ట్రాలర్ల ద్వారా చేపల వేట పెరుగుతోంది. వర్షాకాలంలో భారత్‌లోని మత్సకారులు చేపలు వేటాడరు. ఎందుకంటే ఆ కాలం అంతా బ్రీడింగ్ సీజన్‌గా పరిగణిస్తుంటారు. అంటే చేప పిల్లల గుడ్లు, పిల్లల పెంపు కాలం. కానీ ఈ సీజన్ గురించి బడా ట్రాలర్లు పట్టించుకోవడం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేపల వేట నియంత్రణకు నిబంధనలు రూపొందినా బడా ట్రాలర్లను అదుపు చేయలేకపోతున్నాయి. బడా ట్రాలర్లకు 1990 మొదట్లో ఫిషింగ్ లైసెన్సులు ఇచ్చిన తరువాత సముద్రంలో చేపల సంతతి క్షీణించడం ప్రారంభమైంది. ఈ సమస్యను వెలుగులోకి తేడానికి స్వదేశీ జాగరణ్ మంచ్, థామస్ కొచేరీ వంటి సంస్థల ఆధ్వర్యంలో ఆందోళనలు సాగాయి. దీంతో కొంతకాలం చేపల వేట ముమ్మరంగా సాగకుండా ఆగినా తరువాత మళ్లీ ట్రాలర్లు పర్మిషన్లు పొంది తమ వేటను అడ్డూఆపూ లేకుండా సాగించడం పరిపాటి అయింది. ట్రాలర్లనే నిషేధించాలని పర్యావరణ ఉద్యమ నేతలు ఆందోళన చేపట్టారు. ట్రాలర్లను పూర్తిగా నిషేధించకపోయినప్పటికీ కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాలు వర్షాకాలంలో ట్రాలర్లను నిషేధించడంతో బ్రీడింగ్ అంతరాయం కలగలేదు. 1974లో 10 శాతం వరకు చేపలవేట మితిమీరి సాగగా, ప్రస్తుతం 34 శాతం వరకు పెరిగింది.

చేపల సంతతి క్షీణించడానికి దారి తీస్తోంది. ప్రపంచం మొత్తం మీద 40 మిలియన్ జనం ఈ చేపల వేటపైనే జీవిస్తున్నారు. అక్రమ పద్ధతుల్లో చేపల వేట సాగించేవారికి సబ్సిడీలు రద్దు చేయాలన్న చర్చలు సాగుతున్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలు సబ్సిడీ ఎత్తివేతను ఒప్పుకోవడం లేదు. హిందూ మహాసముద్రంలోకి ఈ ఏడాది తొలి అర్థభాగంలోనే దాదాపు 200 చేపల పడవలు చైనా నుంచి చొచ్చుకువచ్చాయి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్రమబద్ధం కాని, ఈ నౌకలు చట్టవిరుద్ధంగా భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఇఇజెడ్) సమీపంలో చేపల వేట కొససాగిస్తున్నాయని భారత నౌకాదళం పేర్కొంది. చైనా నౌకలతో పాటు ఐరోపా దేశాల నౌకలు కూడా కొన్ని ఇక్కడ వేటసాగిస్తున్నాయి. ఇటీవల కాలంలో డీప్‌సీ ఫిషింగ్ ట్రాలర్లు, ఇతర పడవల కారణంగా ఈ ప్రాంతంలో చైనా కదలికలు పెరిగాయి. చైనా తీరానికి దూరంగా ఇక్కడకు డీప్‌సీ ట్రాలర్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సముద్ర గర్భం పరిస్థితులపై ఇవి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

2015 నుంచి 2019 మధ్య 500 చైనా డీప్‌సీ ట్రాలర్లు ఇక్కడకు వచ్చాయి. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో చేపల వేట సాగిస్తున్న చైనా పడవల్లో మూడో వంతు ఎలాంటి గుర్తింపు లేనట్టు సమాచారం. వీటికి తోడు రెండు పరిశోధన నౌకలు కూడా హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. క్షిపణులను ట్రాక్ చేయగల సామర్థం వీటికి ఉంది. ప్రపంచం మొత్తం మీద చేపల వేటలో ఐదో వంతు చైనా వేటాడుతోంది. మంచినీటి చేపల వేటతో పాటు చైనా చేపల ఎగుమతుల్లో ఎక్కువ భాగం సముద్ర చేపలే ఉంటున్నాయి. ఎక్కువగా వినియోగించడానికి దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఏ చేపా మిగలడం లేదు. చేపల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంటోంది. ఈ మేరకు 1,45,00,000 మంది మత్సకారులు బతుకుతున్నారు. చైనా ఈ చేపలను స్వదేశీ వినియోగానికే కాకుండా తమ మత్స వాణిజ్య రంగాన్ని సుస్థిరం చేసుకోడానికి ఎగుమతుల పై కూడా దృష్టి కేంద్రీకరిస్తోంది.

కె. యాదగిరి రెడ్డి
9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News