Thursday, January 23, 2025

కిడ్నీ రోగాలను తగ్గించే చమురు చేపలు

- Advertisement -
- Advertisement -

చేపలు ముఖ్యంగా చమురు చేపలు తింటే మూత్ర పిండాల వ్యాధుల రిస్కు చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తల పరిశోధన చెబుతోంది. కవ్వలు, కన్నంగదాత, పొలస వంటి చమురు ఉండే చేపలు వారానికి రెండు సార్లైనా తినడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 700 మిలియన్ కన్నా ఎక్కువ మంది కరడుగట్టిన మూత్ర పిండాల వ్యాధుల ( chronic kidney disease ) తో బాధ పడుతున్నారు.

ఇది మూత్ర పిండాల వైఫల్యానికి చివరికి మరణానికి దారి తీస్తుంది. అందువల్ల మూత్ర పిండాల వ్యాధులు ప్రారంభం, పెరుగుదలకు దారి తీసే అంశాలేమిటో వాటిని ఎలా నివారించవచ్చునో తెలుసుకోవలసిన అవసరం ఉంది. చమురు చేపల్లో సముద్ర చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధిక స్థాయిల్లో ఉంటాయని, మూత్ర పిండాల సమస్యలను తగ్గిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే మొక్కల నుంచి వచ్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మాత్రం ప్రభావం చూపించడం లేదని తేలింది.

జార్జి ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్, యూనివర్శిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. కచ్చితంగా ఏ చేపలు మూత్ర పిండాల వ్యాధుల రిస్కును తగ్గిస్తాయో చెప్పలేక పోయినా, ఫ్యాటీ యాసిడ్స్ కు సంబంధించి రక్తం స్థాయిలు మాత్రం ప్రభావం చూపిస్తాయని డాక్టర్ మట్టిమార్క్‌లుండ్ వెల్లడించారు. ఎక్కువ పోషక విలువలున్న సముద్ర నీటి చేపలు ఉదాహరణకు మాగ, కవ్వలు, కన్నంగదాతలు, పొలసలు, నుంచి పీతలు వంటి గుల్ల చేపల వరకు ఫ్యాటీ యాసిడ్స్ తో ఉంటాయి. అందువల్ల చమురు చేపలు, సముద్ర చేపలు ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేస్తున్నారు.

వారానికి కనీసం రెండు సార్లయినా చమురు చేపలు తీసుకుంటే రోజుకు 250 మిల్లీగ్రాములు కన్నా ఒమేగా 3 ఎస్ ఫ్యాటీ యాసిడ్స్ సమకూరుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కు పెద్దల్లో కిడ్నీ వ్యాధులకు గల సంబంధంపై పరిశోధకులు 12 దేశాల నుంచి 19 అధ్యయనాలు సేకరించి పరిశీలించారు. ప్రధాన విశ్లేషణలో దాదాపు 25000 మంది మూత్రపిండాల రోగులైన వాలంటీర్లు పాల్గొన్నారు.

వీరు 49 నుంచి 77 ఏళ్ల వయసు వారు. వీరి వయసు, లింగ నిర్ధారణ, తెగ, శరీరం బరువు, స్మోకింగ్, మద్యపానం అలవాటు, శారీరక దైనందిన పనులు, గుండె జబ్బులు, మధుమేహం, ఇవన్నీ పరిగణన లోకి తీసుకుని పరిశీలించారు. సముద్ర చేపల్లోని అత్యధిక స్థాయిల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావంతో వీరిలో మూత్ర పిండాల వ్యాధుల రిస్కు 8 శాతం వరకు తగ్గిందని బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News