Tuesday, April 15, 2025

ఉపాధి హామీకి ఊతం… గ్రామాల్లో చేపల కొలనులు

- Advertisement -
- Advertisement -

13 కోట్ల పనిదినాల సద్వినియోగం
చేపల ఉత్పత్తితో అదనపు రాబడి
గ్రామీణాభివృద్ధి శాఖ సర్వే

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో చేపల కొలనులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉపాధి అవకాశాలను పెంచేందుకు గాను గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్న పలు పథకాలకు అదనంగా ఇటువంటి కొత్త పథకాన్ని అమలు చేయడం వల్ల జీవన ప్రమాణాలను పెంచినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని రైతులకు, మత్స్యకారులకు అదనపు ఆదాయ వనరులను కల్పించడం ద్వారా అటు వారికి, ఇటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే గ్రామాల్లో చెరువులు, కాలువలు ఉన్నప్పటికీ కొత్తగా చేపల కొలనులు ఏర్పాటు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.

గ్రామాల్లో ఈ మేరకు సర్వే నిర్వహించి ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసిన తర్వాత చేపల కొలనులను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. అదీ కాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా వారికి పనులు కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వ ఆలోచన. గత ఏడాది ఉన్న చేపల ఉత్పాదన లక్షం 4,81,421 టన్నులు కాగా సాధించిన లక్షం 3,69,489 టన్నులు అంటే 76.8 శాతం నమోదైంది. ఈ ఏడాది లక్షాన్ని అధికంగా చేపల ఉత్పాదన చేపట్టడం ద్వారా సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. చేపల కొలనుల ద్వారా ఉత్పత్తి పెంచాలని లక్షాన్ని నిర్దేశించుకుంది.

13 కోట్ల పనిదినాల సద్వినియోగం

రాష్ట్రంలో 2025.26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద 13 కోట్ల పనిదినాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక్కో గ్రామంలో 3,300 పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది 12 కోట్ల పని దినాలను ప్రభుత్వం లక్షంగా చేసుకుంటే కేవలం 10.7 కోట్ల పని దినాలను మాత్రమే పూర్తి చేయడం వల్ల అంటే 89 శాతం మాత్రమే ఆశించిన లక్షం నెరవేరింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ పని దినాలను పెంచుకునేందుకు పరోక్షంగా చేపల కొలనుల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ చేపల కొలనులను ఎక్కడ బడితే అక్కడ ఏర్పాటు చేయకుండా చెరువుకు 100 నుంచి 300 మీటర్ల దూరంలో నిర్మించనున్నారు. 14 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతులో చేపల కొలనులు నిర్మించనున్నారు. చెరువులకు సమీపంలో నిర్మాణాలు చేపట్టడంతో పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసుకునేందుకు వీలుగా ఉంటుంది.

చేపల పెంపకం, వాటిని తగిన పరిమాణంలో పెరిగిన తర్వాత చేపలను పట్టి స్థానిక మార్కెట్లతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేయడం ద్వారా అధిక మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించి రైతులు, మత్సకారుల జీవితాలు బాగుపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదీ కాకుండా ఇటీవల నగర శివారుల్లో చేపల ఎగుమతి హబ్‌లు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ తరహా చిన్న చిన్న చెరువులను తవ్వి వాటిలో చేపలను పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో చేపల ఎగుమతులు నిలదొక్కుకునేందుకు వీలు కలుగుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో చేపల కొలనులు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న చేపల ఎగుమతి ఉత్పాదన సుమారుగా 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉపాది హామీ పథకం కింద గ్రామాల్లో చెరువులను తవ్వించడంతో గ్రామస్తులకు ఉపాధితో పాటు,.మత్స్యకారుల ఆదాయాన్ని అంధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సమర్థవంతంగా అమలు చేయాలని ఈ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు అప్పగించింది.

అనువైన భూములు గుర్తిస్తున్న అధికారులు

ప్రతి గ్రామ పరిధిలో ఉన్న చెరువులకు దగ్గరలో అనువైన భూమి, నీటిని తరలించేందుకు అనువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించే పనిని గ్రామీణాభివృద్ధి శాఖ కింది స్థాయి అధికారులు చేపట్టారు. తమ పరిధిలోని చెరువులు, కుంటల సందర్శించి, చేపల కొలనుల ఏర్పాటుకు అనువైన భూములను గుర్తిస్తారు. ఆ తర్వాత స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, మత్స్యశాఖల అధికారుల అనుమతులు తీసుకుంటారు. ఇదంతా పూర్తైన తర్వాత ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్‌కు పంపి అక్కడ ఆమోదం లభించిన తర్వాత పనులు చేపడతారు. ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు చెరువులు, శిఖం భూముల సంరక్షణకు ప్రభుత్వం ఓ కొత్త ఆలోచన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చేపల కొలనుల ఏర్పాటతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News