Monday, December 23, 2024

కెసిఆర్ కృషివల్లే 4.5 లక్షల టన్నులకు చేరిన చేపల ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

రూ.33వేలకోట్లకు చేరిన మత్స్య సంపద
1.20లక్షల కుటుంబాలకు లబ్ధి :  పిట్టల రవీందర్ ముదిరాజ్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 2.5 లక్షల టన్నుల నుంచి 4.5లక్షల టన్నులకు పెరిగిందని రాష్ట్ర ఫిషరీష్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు.  పిట్టల సోమవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉనికి కాలంలో తెలంగాణ ప్రాంతంలోని మత్స రంగాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగానే మరిచిపోయి తీవ్రమైన నిర్లక్ష్యానికి గురిచేసిందన్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనా కాలంలో తెలంగాణ మత్స రంగం దేశంలోనే అగ్ర భాగాన నిలిచే స్థాయికి చేరుకున్నదని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం రెండున్నర లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఇవాళ నాలుగున్నర లక్షలకు చేరుకున్నదని , కెసిఆర్ దూర దృష్టి ఫలితంగా కాలేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపల ఉత్పత్తికి అనువైన నీటి విస్తీర్ణం ఆరున్నర లక్షల హెక్టార్ల నుండి 7,70,000 హెక్టార్లకు పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం మూడు లక్షలు గా ఉన్న మత్స్యకారుల సంఖ్య ఇవాళ ఆరు లక్షలకు పెరిగిందని, ఉమ్మడి రాష్ట్ర ఉనికి కాలంలో దాదాపు 60 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సాధించలేని ప్రగతిని కేవలం 9 ఏండ్ల కాలంలోనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించగలిగిందన్నారు. గ్రామపంచాయతీ చెరువుల పైన మత్స్యకారులకే పూర్తి అధికారాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించిందని వివరించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా 1000 కోట్ల రూపాయల భారీ నిధులతో సమగ్ర మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు చేసి సుమారు 1,20,000 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించిందని ఆయన అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా గడచిన ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వమే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని విజయవంతంగా అమలు జరుపుతున్నదని, ఫలితంగా గడచిన ఎనిమిది సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 33 వేల కోట్ల రూపాయల విలువైన చేపల సంపదను సృష్టించి మత్స్యకార కుటుంబాలకి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని గుర్తుకు చేశారు.

తెలంగాణ మత్స రంగంలో సర్వతో ముఖాభివృద్ధిని సాధించే దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదని, మత్సరంగంలో మహిళ సాధికారికతను సాధించేందుకు మహిళ మత్స్యకార సొసైటీలను , మత్స్యకార మార్కెటింగ్ సొసైటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గత పాలకులు 60 ఏళ్లలో తెలంగాణ మత్స రంగానికి చేసిన అన్యాయాన్ని కేవలం 9 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం సవరించడమే కాకుండా, దేశంలోనే తెలంగాణ ఈ రంగం అగ్ర భాగాన నిలిచేందుకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులందరినీ లక్షాధికారులను చేసే లక్ష్యంతో కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తున్నదని, అందువల్ల రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలను మభ్య పెట్టేందుకు బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను మత్స్యకార కులాలకు చెందిన ప్రజలు తిప్పి కొట్టాలని పిట్టల రవీందర్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News