Sunday, December 22, 2024

ఎఐతో మత్య్సరంగానికి లాభమా?

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో తరతరాలుగా కోట్లాది మందికి ఉపాధిని అందించడంతో పాటుగా ఆరోగ్యకరమైన పౌష్టిక మాంసాహారాన్ని అందిస్తున్న మత్స్యరంగం మీద కృత్రిమ మేధస్సు సునామీలా విరుచుకుపడబోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవంబర్ 8వ తేదీన కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నగరంలో కేంద్ర సముద్ర జలవనరుల మత్స్యపరిశోధనా కేంద్రం (సిఎంఎఫ్‌ఆర్‌ఐ)లో నిర్వహించిన మత్స్యకారుల చైతన్య సదస్సు సందర్భంగా కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ కృత్రిమ మేధస్సు ఆధారిత ఉపరితల డైన్ యంత్ర పరికరాన్ని ప్రదర్శించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి 2024 సంవత్సర ఆరంభంలోనే జనవరి 5వ తేదీన ఇదే ప్రాంగణంలో ‘నీతిఆయోగ్’ జాతీయ ఉపాధ్యక్షులు సుమన్ భేరీ సమక్షంలో జరిగిన సమాలోచన సందర్భంలోనే మత్స్యరంగం అభివృద్ధికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (కృత్రిమ మేధస్సు) సహాయంతో ఉపరితల డ్రోన్లు, రోబోటిక్ యంత్ర పరికరాలు, జలాంతర్గాముల్లాంటి’ అండర్ వాటర్ డ్రోన్ల’ను ఉపయోగించుకుని దేశంలోని ఆక్వాకల్చర్, మత్స్యరంగాలలో సాధించగలిగే పురోభివృద్ధిపై మేధోమథనం జరిగింది.

తొలిదశలో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఎఐ) సముద్ర తీరప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రాలలో మాత్రమే వినియోగించాలని నిర్దేశించుకున్నట్లు బహిరంగ పరుస్తున్నప్పటికీ, తదనంతర విస్తరణలో భాగంగా చేపల ఉత్పత్తితో ముడిపడి ఉన్న అన్ని ప్రక్రియలలోనూ, దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ఉపయోగించవలసిన తప్పనిసరి పరిస్థితులు నెలకొంటాయని ఈ రంగం మీద పరిశోధనలు నిర్వహిస్తున్న మత్స్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొచ్చిన్‌లో కృత్రిమ మేధస్సు (ఎఐ) ఆధారిత క్రేన్ల పని తీరును ప్రదర్శించిన సందర్భంగా కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ప్రస్తావించిన అంశాల సారాంశం ప్రకారం, సముద్రంలో మత్స్యకారులు పట్టిన చేపలను సునాయాసంగా ఒడ్డుకు చేర్చడానికి, చేపలవేటకు వెళ్లిన జాలర్లకు సంబంధించిన మర పడవలకు రక్షక కవచంగా వినియోగించడానికి, నడిసముద్రం లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకున్న సందర్భాలలో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేరవేసేందుకు, సముద్రంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహించే చేపల వేటను నిలువరించేందుకు, సముద్రంలోని చేపల ఆరోగ్యాలను సంరక్షించేందుకు అనుగుణంగా ఈ డ్రోన్లను వినియోగిస్తారు.

ఫలితంగా సముద్రంలో చేపలుపట్టే మత్స్యకారులకు ఈ డ్రోన్లు అన్ని రకాలుగా సహాయకారిగానూ, రక్షక కవచంగానూ, శ్రమను తగ్గించే విధంగానూ, సముద్రంలో పట్టిన చేపల నాణ్యతను కాపాడే విధంగానూ, సకాలంలో సముద్రం నుండి చేపలను మార్కెట్‌కు చేర వేసేందుకుగానూ ఉపయోగపడతాయి. అంతేకాకుండా, సముద్ర గర్భంలో వినియోగించే అండర్ వాటర్ డ్రోన్ల సహకారంతో చేప పిల్లల ఆరోగ్య, ఆహార సమస్యలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతోపాటుగా అందుకు సంబంధించిన తరుణోపాయాలను కూడా అమలుపరుస్తారు. ఈ పనుల పర్యవసానంగా నానాటికీ తగ్గుముఖం పడుతున్న సముద్రచేపల ఉత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడంవల్ల మత్స్యకారుల ఆదాయ వనరుల్లో గణనీయమైన వృద్ధిరేటును సాధించేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.

ఇక కృత్రిమ మేధస్సు అనుసంధానంతో నిర్వహించే రోబోటిక్ యంత్రాలు సముద్రంలో కేజ్ కల్చర్ లాంటి ఆధునిక చేపల పెంపకానికి సంబంధించిన అనేక క్లిష్టమైన విధులను ఎంతో సమర్ధవంతంగానూ, సులభంగానూ నిర్వహిస్తాయి. సముద్రంలో ఆధునిక పరిజ్ఞానంతో నిర్వహించే కేజ్ కల్చర్‌ను మానవ రహిత డ్రోన్ పరికరాలు, రోబోటిక్ యంత్రాలు, అండర్ వాటర్ డ్రోన్ల సహకారంతో రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ల పద్ధతిలో సముద్రతీరం నుండి నిర్వహిస్తారు. మొత్తంగా మత్స్యకారుల ప్రమేయం లేకుండానే సముద్రంలో కృత్రిమ పద్ధతులలో, కృత్రిమ మేధస్సు వినియోగంతో చేపల పెంపకానికి సంబంధించిన ప్రక్రియలన్నింటినీ నిర్వహించగలుగుతారు. మత్స్యకారులకు సహాయకారిగా ప్రారంభమయ్యే కృత్రిమ మేధస్సు అంతిమంగా మత్స్యరంగాన్ని తన గుప్పిట్లోకి బిగించుకుంటుంది. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా సముద్ర జలవనరుల చేపల పెంపకానికి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్లుగా ఉన్నతాధికార వర్గాలు నమ్మబలుకుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మత్స్యశాఖ రానున్న నాలుగు సంవత్సరాల కాలానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించడానికి ఉపరితల జలవనరులకు సంబంధించిన మత్స్య రంగాలకు కూడా ఈ అత్యాధునిక ఆవిష్కరణలు పరోక్ష పద్ధతుల్లో చొరబడటం ఖాయంగా కనిపిస్తున్నది.

దేశవ్యాప్తంగా విస్తరించుకుని, సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధికి జీవనాడిగా ఉపయోగపడుతున్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలు లాంటి చిన్న నీటి వనరులలో ఎఐ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ పెద్దపెద్ద చెరువులు, భారీజలాశయాలు, ప్రాజెక్టులకు సంబందించిన బ్యాక్ వాటర్స్‌లలోను, నీటిపారుదల ప్రాజెక్టులులాంటి నీటి వనరులలో చేపట్టి చేపల పెంపకానికి సంబంధించిన కార్యకలాపాలలో అనివార్యంగా కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక ఉపకరణాలు, అత్యాధునిక యంత్రాలు వినియోగంలోకి తీసుకురావడం అనివార్యంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా మన దేశం నుండి ఇతర దేశాలకు చేపలను, చేపల ఆహారాన్ని ఎగుమతులను భారీ ఎత్తున పెంపొందించడం ద్వారా సమీప భవిష్యత్తులో లక్ష కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రప్రభుత్వం సముద్ర జలాల నుండి ఉత్పత్తి చేసి ఆక్వా ఉత్పత్తులతో పాటుగా, ఉపరితల జలవనరుల నుండి చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాలని ఆలోచిస్తున్నది.

ప్రధాన మంత్రి పెంట చేపట్టి అమలుపరుస్తున్న పిఎంఎంఎస్‌వై, పిఎంఎంకెఎస్‌ఎస్‌పై ద్వారా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన అంతర్గత లక్ష్యాలు కూడా ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. ఉపరితల జలవనరుల నీటి విస్తీర్ణంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్న తెలంగాణ లాంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోని రిజర్వాయర్లు, నీటిపారుదల ప్రాజెక్టులలో అత్యాధునిక పద్ధతులను అమలు పరచడం ద్వారా చేపల ఉత్పత్తిని భారీ యెత్తున పెంచేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతి హెక్టారుకు కనీసం మూడు నుండి ఐదు టన్నుల చేపలను పెంచేందుకు అవకాశాలున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం హెక్టారుకు టన్ను చేపలను కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నారని, ఇందుకు ఇక్కడి సాంప్రదాయ మత్స్యకారుల్లో వృత్తి నైపుణ్యం లేకపోవడమే ప్రధాన కారణంగా ఈ -రంగానికి సంబంధించిన నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి అనుకుని నిర్మించిన మిడ్ మానేర్ డ్యాం (యంయండి) పరీవాహక ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఒక పిషరీస్ హట్ ను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం విఫలయత్నం చేసింది. అయితే స్థానికంగా పరిస్థితులు అనుకూలించకపోవడం, తదితర కారణాలవ ల్ల మిడ్ మానేరులో భారీ పెట్టుబడులతో పెద్ద ఎత్తున నిర్వహించతల పెట్టిన కేజ్ కల్చర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురాలేకపోయింది. తెలంగాణలో కేజ్ కల్చర్ పద్ధతులను పెద్ద ఎత్తున అమలులోకి తీసుకురావడానికి ఇక్కడి మత్స్యశాఖ చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఏ మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. పైగా స్థానిక మత్స్యకారుల్లో కేజ్ కల్చర్ అనే అధునాతన పద్ధతి ఇక్కడి పరిస్థితులకు అనుకూలం కాదనే దురభిప్రాయం స్థిరపడిపోయింది. రీ-సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టం (ఆర్‌ఎఎస్), బయో ఫ్లాక్ ఫిష్ ఫార్మింగ్ టెక్నాలజీ పెన్ కల్చర్, రేస్ వేస్ లాంటి ఇతర రకాలైన ఆధునిక చేపల పెంపకానికి సంబంధించిన ప్రయోగాల విషయంలోనూ కేజ్ కల్చర్ లాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఆ శాఖకు సంబంధించిన అధికారుల్లో సరైన అవగాహన, దీక్షాదక్షతలు లేని కారణంగానే. తెలంగాణ మత్స్యరంగంలో ఆధునిక విధానాల పట్ల ఇక్కడి సాంప్రదాయ మత్స్యకారుల్లో నిర్లిప్త ధోరణులు ప్రబలిపోవడానికి మరో ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పిట్టల రవీందర్
99630 62266

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News