Tuesday, January 21, 2025

మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి!

- Advertisement -
- Advertisement -

గడచిన పది సంవత్సరాల టిఆర్‌ఎస్/ బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో తెలంగాణ మత్స్యరంగం గతం లో ఎన్నడూ లేని విధంగా పురోభివృద్ధిలో ప్రయాణించడం ప్రారంభించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ అమలు జరిపిన పథకాలు ఇందుకు ఎంతో దోహదం చేశాయి. ముఖ్యంగా 2016 నుండి గడచిన 8 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో మాత్రమే అమలు జరుపుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఈ రంగం అభివృద్ధి పట్ల మత్స్యకారుల్లో విశ్వాసాన్ని కలుగజేసింది. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో జాతీయ సహకార ఆర్థిక సంస్థ (ఎన్‌సిడిసి) సహకారంతో సమీకరించిన వెయ్యి కోట్ల రూపాయల భారీ రుణ సదుపాయం గతం లో విస్మరణకు, తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ మత్స్య రంగం సత్వర అభివృద్ధికి ఆస్కారం కల్పించింది. ఈ నిధుల తో ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ అమలు చేయడం ద్వారా మత్స్య సహకార సంఘాలలోని సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసింది.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మత్స్యరంగం అభివృద్ధికి అవసరమైన మరికొన్ని చర్యలను కూడా తీసుకున్నది. ఇందులో భాగంగా మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, ఆ సంఘాలలో సభ్యత్వానికి సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేసింది. గ్రామ పంచాయితీ చెరువులను వేలం వేసే విధానాన్ని రద్దు పరచి ఆ చెరువులపై హక్కులను మత్స్యశాఖకు బదిలీ చేయడం ద్వారా స్థానిక మత్స్య సహకార సంఘాలకు ఆ చెరువులలో చేపలను పెంచుకునే సదుపాయం కల్పించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తీయడంతో నీటి నిలువ సామర్థ్యం పెరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుబంధంగా నిర్మించిన జలాశయాల నుండి నీటిని ఎత్తిపోసి చెరువులను నింపడం చేపల పెంపకానికి మరింత దోహదం చేసింది. గతంలో సంవత్సరంలో కేవలం వేసవి కాలంలో మాత్రమే చేపల వేటను కొనసాగించిన సాంప్రదాయం నుండి ఏడాది పొడవునా చేపలు పట్టుకోడానికి మత్స్యకారులకు సౌకర్యం సమకూరింది.పర్యవసానంగా మత్స్యకారుల ఆదాయాలు పెరిగి తెలంగాణ మత్స్యరంగం మీద మత్స్యకార కులాలకు సంబంధించిన కుటుంబాలలో కొత్త ఆశలు చిగురించాయి. తెలంగాణ మత్స్యరంగం యువతకు ఒక ఉపాధి వనరుగా రూపాంతరం చెందింది. ఫలితంగా స్థానిక మత్స్య సహకార సంఘాలలో సభ్యత్వానికి పోటీ పెరిగింది. ఫిషరీస్ సొసైటీలో సభ్యత్వం కలిగి ఉండడం సామాజికంగా ఒక గౌరవప్రదమైన స్థాయిగా మారింది.

అయితే ఈ రంగం అభివృద్ధికి మౌలిక వనరులను సమకూర్చడం మత్స్యకారుల్లో విశ్వాసాన్ని నింపడం తదితర పరిమితమైన అంశాలపై మాత్రమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి నిలపడం వల్ల ఈ రంగాన్ని ప్రభావితం చేసే దీర్ఘకాలిక సమస్యలు ఆటంకాలుగా పరిణమించాయి. ముఖ్యంగా మత్స్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రాణవాయువుగా ఉపయోగపడే ప్రాథమిక మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణులను ప్రదర్శించిందని అపవాదులు మూటగట్టుకున్నది.

ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసుకున్న 33 జిల్లాలకు జిల్లా మత్స్య సహకార సంఘాలను నిర్మాణం చేయడం రాష్ట్రస్థాయిలో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్యను ఫిషరీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం లాంటి నిర్మాణపరమైన అంశాల విషయంలో గత ప్రభుత్వం బుద్ధిపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. గడచిన 9 సంవత్సరాల టిఆర్‌ఎస్ పార్టీ పాలనా కాలంలో ఇందుకు సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి పలు మత్స్య సహకార సంఘాల నాయకులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ‘జిల్లా మత్స్య సహకార సంఘాల’ ఏర్పాటు, ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను గత ప్రభుత్వం ప్రారంభించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనే ఆయన మత్స్యరంగం భవిష్యత్తు మీద సుదీర్ఘంగా అసెంబ్లీ వేదిక మీద ప్రసంగించారు. కానీ ఆయన చెప్పినట్లుగా మత్స్య శాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేసే పని ఇంత వరకు కనీసం ప్రారంభం కూడా కాలేదు. చేపల మార్కెటింగ్‌లోను, చెరువుల నిర్వహణలోనూ దళారుల పాత్రను సమూలంగా నిర్మూలిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన వాగ్దానం కూడా ఇంతవరకు నెరవేరలేదు.

తెలంగాణ మత్స్యరంగం సర్వతో ముఖాభివృద్ధికి ‘ఫిషరీస్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఆధునిక విధానాలను ఆక్వా కల్చర్ రంగంలో అమలులోకి తెస్తామని కెసిఆర్ ఇచ్చిన వాగ్దానం కూడా పదేళ్లు కావస్తున్న అమలుజరగలేదు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు జరిపిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలోను, రూ. 1000 కోట్ల భారీ నిధులతో అమలు జరిపిన ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ అమలులోను వెలుగులోకి వచ్చిన ఆరోపణలు, విమర్శలను గత ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా ఉచిత చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్ల చేతివాటం, చెరువుల నిర్వహణలోనూ చేపల మార్కెటింగ్‌లోను మధ్య దళారుల గుత్తాధిపత్యం నిర్నిరోధంగా కొనసాగుతున్నది.

కొత్త ప్రభుత్వంతో… సరికొత్త ఆశలు!
ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా పరిపాలన బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ మత్స్య రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఒక సవాలుగా మారుతుంది అనడంలో సందేహం లేదు. తెలంగాణ మత్స్య రంగంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న మార్పులను, చేర్పులను తీసుకురావాలనుకుంటే ముందుగా ఆ రంగంలోని భౌతిక పరిస్థితులను మార్చుకోవాలి. ముఖ్యంగా పీకలలోతు దాకా అవినీతిలో కూరుకుపోయిన మత్స్య శాఖ అధికార వర్గంలో పైనుండి క్రింది స్థాయి వరకు సమూల ప్రక్షాళన నిర్వహించడం అత్యవసరం.

కొత్తగా ఏర్పడిన 23 జిల్లాలకు జిల్లా మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే కొంత వరకు పూర్తయింది. సహకార చట్టాన్ని అనుసరించి ప్రజాస్వామిక పద్ధతిలో ఆ సంఘాలకు సత్వరమే ఎన్నికలు నిర్వహించి జిల్లా స్థాయిలో ‘జిల్లా మత్స్య సహకార సంఘాల’ ను రాష్ట్రస్థాయిలో ‘మత్స్య సహకార సంఘాల సమాఖ్య’ (ఫిషరీస్ ఫెడరేషన్)ను ఏర్పాటు చేసుకోవాలి. మత్స్య సహకార సంఘాల నిర్వహణలో మత్స్యశాఖ ప్రమేయాన్ని పూర్తిస్థాయిలో తగ్గించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మత్స్య సహకార సంఘాలన్నీ సహకార చట్టం స్ఫూర్తితో, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

మత్స్యకారుల ఆర్థిక స్వావలంబనకు ఇతోధికంగా దోహదపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం నిర్వహణలో మత్స్య శాఖ ప్రమేయాన్ని తొలగించి ‘ఫిషరీస్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలోనే ఆ పథకాన్ని అమలు జరపాలి. ఫిషరీస్ ఫెడరేషన్‌కు సమాంతరంగా ‘ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’నో ఏర్పాటు చేసి ఈ రెండు వ్యవస్థలను సమన్వయం చేసే బాధ్యతలను మత్స్య శాఖకు అప్పగించాలి. కేంద్ర ప్రభుత్వంలో మాదిరిగా రాష్ట్ర స్థాయిలోనూ మత్స్యశాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి సత్వర నిర్ణయాలకు, వేగవంతమైన అభివృద్ధికి అవకాశాలు కల్పించాలి. మత్స్యశాఖ కమిషనర్‌నే ఫిషరీస్ ఫెడరేషన్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించుకునే సాంప్రదాయాన్ని రద్దు పరచి ఫెడరేషన్‌కు ప్రత్యేకంగా ఒక ఉన్నతాధికారిని నియమించుకోవాలి. ప్రభు త్వం సరఫరా చేస్తున్న ఉచిత చేప పిల్లల ద్వారా ఉత్పత్తి అయిన మత్స్య సంపాదన ఫిషరీస్ ఫెడరేషన్ ప్రమేయంతో తిరిగి సేకరించుకునే వెసులుబాటును (బై-బ్యాక్ విధానం) కల్పించడం ద్వారా మత్స్యకారులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటుగా, చేపల మార్కెటింగ్‌లో మధ్య దళారీల ప్రమేయం కూడా రద్దు అవుతుంది.

ఈ విధానంలో మత్స్య సహకార మార్కెటింగ్ సొసైటీలకు, మహిళా మత్స్య సహకార సంఘాలకు కూడా పనితో పాటు ఆదాయం కూడా చేకూరుతుంది. ప్రభుత్వ మత్స్య శాఖలో ఇప్పుడు కొనసాగుతున్న బ్రిటిష్ కాలం నాటి పాలనా విధానాన్ని మార్చివేసి అధికార వికేంద్రీకరణ పద్ధతుల ద్వారా ఉద్యోగ వర్గాల్లో బాధ్యతలను నిర్దేశించాలి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన ‘ఆక్వా కల్చర్’ పద్ధతులను తెలంగాణలోని జలాశయాలు, ఇతర భారీ, మధ్యతరహా జలవనరులలో ప్రవేశపెట్టి చేపల సంరక్షణలో, ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్తంగా అమలులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలి.

తద్వారా మత్స్య రంగంలో ఉత్పత్తి ఉత్పాదకతలను జాతీయ సగటుకు పెంచుకోవడం ద్వారా మత్స్యకారుల ఆదాయాల్లో గణనీయమైన వృద్ధిరేటును సాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. సాంప్రదాయ మత్స్యకారులు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే రీతిలో వారికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలి. చేపల ఉత్పత్తికి అనుబంధంగా ఫిష్ ప్రాసెసింగ్, వాల్యూ ఆడిషన్, చేపల ఉత్పత్తుల తయారీ, విదేశాలకు చేపల ఎగుమతులు, తదితర కార్యకలాపాలను విస్తృతపరిచి, రాష్ట్రంలోని మత్స్యకార కులాలకు చెందిన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

పిట్టల రవీందర్
99630 62266

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News